ఏపీ వ్యాప్తంగా ఎక్కడ చూసినా.. ప్రభుత్వ పథకాలకు, అంబులెన్సులకు , ఆఫీసులకు, పిల్లల యూనిఫారాలకు ఎక్కడచూసినా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులు మాత్రమే కనిపిస్తుంటాయి. జగనన్న బొమ్మలు మాత్రమే కనిపిస్తుంటాయి. ప్రజల సొంత పొలాలకు ప్రభుత్వం పట్టా ఇచ్చినా కూడా దాని మీద కూడా జగనన్న బొమ్మ ముద్రించడం వారికి ఒక అలవాటు అయిపోయింది. పొలం హద్దురాళ్ల మీద జగన్ బొమ్మను ముద్రించి.. అదేదో శిలాశాసనం అన్నట్టుగా.. భూమి ఉన్నంత కాలం తన బొమ్మ పదిలంగా ఉండాలని అన్నట్లుగా చేసే ప్రయత్నాలూ మనకు కనిపిస్తుంటాయి. అదే కోటాలో.. కేంద్రం డబ్బులతో అమలు చేసే పథకాలకు కూడా.. ఎడాపెడా తమ పేరు పెట్టుకుని తాము కీర్తి గడించాలని చూస్తే మాత్రం ఇబ్బందే. ఇప్పుడే అదే జరుగుతోంది. మా నిధులతో మీరు మిమ్మల్ని ప్రమోట్ చేసుకోవడం ఏమిటి? అంటూ కేంద్రప్రభుత్వం దాదాపు అయిదు వేల కోట్ల రూపాయలకు బ్రేకులు వేసింది. నిధులు విడుదల అవసరం కావడం, వేరే గత్యంతరం లేకపోవడంతో.. జగన్ సర్కారు అనేక మెట్లు దిగివచ్చి మడమ తిప్పి.. పథకానికి పేరు మార్చి.. ఆల్రెడీ పూర్తయిన దాదాపు అయిదువేల ఇళ్లకు బోర్డులు కూడా మార్పించే అదనపు భారాన్ని నెత్తికెత్తుకుంది. ప్రభుత్వం అనుచితమైన కీర్తి కండూతికి ఇది ఒక అదనపు ఖర్చు అని అనుకోవాలి.
ఇంతకూ విషయం ఏంటంటే.. కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజనకింద పేదలకు ఇళ్లు నిర్మించడానికి రాష్ట్రప్రభుత్వాల చేతికి నిధులు ఇస్తుంది. ఒక్కొక్కరికి రూ.1.80 లక్షల వరకు ప్రాంతాన్ని బట్టి నిధులు కేటాయిస్తారు. అయితే రాష్ట్రప్రభుత్వం ఈ పథకానికి వైఎస్సార్ పేరును జోడించింది. నిర్మించిన ఇళ్ల మీద బిగించే బోర్డుల మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నవరత్నాల లోగోను కూడా వేయించారు. దీనిమీద కేంద్రం సీరియస్ అయింది. ఇలాగైతే మేం అసలు పూర్తయిన పనులకు కూడా బిల్లులు ఇవ్వబోయేది లేదంటూ ఆగ్రహించింది.
జగన్ ప్రభుత్వం స్థలాలు తాము ఇస్తున్నామని, మౌలిక వసతులు కల్పిస్తున్నామని తాము కూడా ఖర్చు పెడుతున్నాం గనుక.. పథకంలో తమ పేరు కూడా ఉండాలని రకరకాలుగా బుకాయించే ప్రయత్నం చేసింది గానీ.. కేంద్రం ససేమిరా అంది. అదంతా కుదరదు.. కేవలం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించినఇళ్లులాగా బోర్డులు మార్పిస్తే తప్ప నిధులు ఇవ్వబోమని చెప్పింది. దాదాపు అయిదువేల కోట్ల రూపాయల బిల్లులు ఆగడంతో ప్రభుత్వం కంగారుపడి బోర్డులు మార్పిస్తోంది. జగన్ ప్రభుత్వం ఓవరాక్షన్ కు కేంద్రం మంచి మొట్టికాయ వేసినట్టు అయింది.