ముగ్గురు ఐపీఎస్‌ల బదిలీ.. ‘ బిగినింగ్’

Thursday, July 4, 2024

చంద్రబాబునాయుడు ప్రభుత్వం రాష్ట్రంలో  ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కేవలం ముగ్గురు ఐపీఎస్ లేనా? అని నివ్వెరపోవాల్సిన అవసరం లేదు. ఇది కేవలం ‘ది బిగినింగ్’ మాత్రమేనని.. జగన్ ప్రభుత్వంతో అంటకాగిన, నీతి నిజాయితీల్ని, చట్టాల్ని కూడా తుంగలో తొక్కేసి.. జగన్ రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించడం ఒక్కటే లక్ష్యంగా బతికిన ఐపీఎస్ లు అందరి జాబితాను సిద్ధం చేస్తున్నారని అమరావతి వర్గాలు చెబుతున్నాయి. కాకపోతే.. జగన్ పట్ల వీరభక్తిని ప్రదర్శించడంలో ప్రత్యేకశ్రద్ధతో వ్యవహరించిన ముగ్గురిని తొలివిడతలో బదిలీచేశారు.

కడప జిల్లాకు చెందిన కసిరెడ్డి రాజేంద్రనాధ్ రెడ్డి జగన్ కు ఎంతటి వీరవిధేయులో అందరికీ తెలుసు. గౌతం సవాంగ్ ను తొలగించిన తర్వాత.. రాజేంద్రనాధ్ రెడ్డిని జగన్ డీజీపీగా చేశారు. ఆయనకంటె చాలా మంది సీనియర్లు ఉన్నప్పటికీ.. అందరినీ పక్కకు నెట్టి మరీ తనకు కావాల్సిన వ్యక్తిని అందలంపైకి తెచ్చారు. ఆయనకూడా దానికి తగ్గట్టుగానే జగన్ సేవలో తరించారు. రాజేంద్రనాధ్ రెడ్డి రాష్ట్ర పోలీసు యంత్రాంగం మొత్తాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మార్చేశారు. ఇంకా చెప్పాలంటే.. ఎమ్మెల్యేలకు పోలీసులను తొత్తులుగా తయారుచేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎంత చెప్తే అంతే అన్నట్టుగా.. చట్టాలతో పనిలేకుండా పోలీసులు చెలరేగిపోయారు. తాను డీజీపీగా ఉన్న కాలంలో తెలుగుదేశం నాయకులు మొరపెట్టుకోవడానికి వచ్చిన ఒక్క సందర్భంలో కూడా రాజేంద్రనాధ్ రెడ్డి వారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదంటే.. ఆయనలోని జగన్ భక్తి ఎంతగా టాప్ రేంజికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు.

అలాంటి డీజీపీని ఇప్పుడు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా నియమించారు. ఆయనతో పాటు.. గతంలో సీఐడీ చీఫ్ గా వ్యవహరించిన.. సునీల్ కుమార్ ను ఏకంగా జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. వైసీపీకి అనుకూలంగా ఉండడం మాత్రమే కాదు. ఎంపీ రఘురామక్రిష్ణ రాజు మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారని కూడా ఆయన మీద ఆరోపణలున్నాయి. అలాగే.. గతంలో చిత్తూరు ఎస్పీగా ఉంటూ.. చంద్రబాబునాయుడు మీద పుంగనూరు అంగళ్లు వద్ద ఆకతాయిలు రాళ్లు రువ్వి చెలరేగడానికి ప్రోత్సహించారని, ఆ వ్యవహారంలో తెదేపా వారి మీదనే కేసులు పెట్టించారని పేరున్న ఎస్పీ రిషాంత్ రెడ్డిని కూడా టాస్క్ ఫోర్స్ బాధ్యతల నుంచి తప్పించి పోలీసు హెడ్ క్వార్టర్స్ కు రిపోర్టు చేయాలని ఆదేశించారు.

అయితే ఈ ముగ్గురు మాత్రమేనా? రాష్ట్రంలో జగన్ భక్తితో చెలరేగిపోయిన అధికారులు ఇంకా చాలా మందే ఉన్నారు. త్వరలోనే వారందరినీ కూడా శంకరిగిరిమాన్యాలు పట్టించేలా ప్రభుత్వ ఉత్తర్వులు రానున్నాయని అమరావతి వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles