మూడు పార్టీలు.. మూడు దారులు:: బాబు రూటే బెస్ట్!

Wednesday, December 25, 2024

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. లోక్ సభలో బొటాబొటీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన మోడీ 3.0 సర్కారు మీద ఒత్తిడి పెంచితే తమ తమ రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చుకోవచ్చుననే ఆశ.. అంతోఇంతో బలమున్న ప్రాంతీయ పార్టీలున్న అన్ని రాష్ట్రాల వారికి కూడా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోని మూడు కీలక రాష్ట్రాలు ఒకే జంక్షన్ వద్ద ఉన్నాయి. బీహార్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోరికను వ్యక్తం చేస్తున్నాయి.

అయితే కనీసం ఏ ఒక్కరికైనా ఈ కోరిక నెరవేరుతుందా అనేది మాత్రం సందేహాస్పదమే. ఇంకా లోతుగా విశ్లేషించాలంటే- మూడు రాష్ట్రాల నాయకులు కూడా ఒకే రకమైన డిమాండ్ చేస్తున్నప్పటికీ, కేంద్రం మీద వారు పెడుతున్న ఒత్తిడి మోతాదులో తేడాలు ఉన్నాయి. అయితే ఏతావతా విశ్లేషకులు భావిస్తున్నది ఏంటంటే.. చంద్రబాబు నాయుడు అనుసరించబోతున్న మార్గమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుతుంది అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది అనుచితమైన రీతిలో విభజన చేయడం వలన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం! ఆరకంగా ఏపీ ప్రజలకు అది చట్టబద్ధమైన హక్కు. సాక్షాత్తూ పార్లమెంటులో అప్పటి ప్రధాని పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామంటూ చేసిన ప్రకటనకు కచ్చితంగా చట్టంతో సమానమైన మన్నన దక్కాలి. కానీ మోడీ సర్కార్ దాని గురించి ఏమాత్రం పట్టించుకోలేదు.
ఇలాంటి నేపథ్యంలో మోడీ 3.0 సర్కారు ఏర్పడింది.

ఎన్డీఏ కుటుంబంలో మూడో అతిపెద్ద పార్టీగా కేవలం 12 మంది ఎంపీలను మాత్రం కలిగి ఉన్న నితీష్ కుమార్ సారధ్యంలోని జేడీయూ ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్ వినిపిస్తూ ఉంది. లోక్ జనశక్తి కూడా బీహార్ కు ప్రత్యేక హోదా గురించి గట్టిగా మాట్లాడుతున్నది. ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ ఏదో ఒకటి తమ రాష్ట్రానికి ఇచ్చి తీరాల్సిందే అని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

అదే క్రమంలో ఒరిస్సాలో బిజూ జనతాదళ్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో అధికారాన్ని కోల్పోయినా కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్లు తీసుకొస్తున్నారు. వారు కూడా అచ్చంగా బీహార్ లోని జెడియు మాదిరిగా ఐతే ప్రత్యేక హోదా, కుదరకపోతే ప్రత్యేక ప్యాకేజీ తమ రాష్ట్రానికి ఇచ్చి ఆదుకోవాలని గట్టిగా అడుగుతున్నారు. ఈ ఇద్దరు నాయకులు ఇలా చేస్తుండగా చంద్రబాబు నాయుడు మాత్రం హోదా డిమాండ్ గాని, ప్యాకేజీ డిమాండ్ గాని బహిరంగంగా ఎక్కడా చర్చకు తేవడం లేదు.

ప్రస్తావించడం లేదు. కానీ చాప కింద నీరు లాగా రాష్ట్రానికి కావలసిన ప్రయోజనాలను కేంద్రం ద్వారా చక్కబెట్టుకు వచ్చేస్తున్నారు. నిజం చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఎంతో ఎక్కువ సుస్థిరంగా నిలబడి ఉన్నది అంటే- అది కేవలం తెలుగుదేశం పుణ్యం అని చెప్పాలి! ఎన్డీఏ కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం ఉంటున్నది.

చంద్రబాబు నాయుడు మాత్రం ఈ రెండు మిగిలిన రెండు రాష్ట్రాల వారిలాగా గోల గోల చేయకుండా ప్రశాంత చిత్రంతో ఢిల్లీలోని పనులను పూర్తి చేసుకోగలుగుతున్నారు.హోదా- ప్యాకేజీ వంటి పడికట్టు పదాలతో నిమిత్తం లేకుండా రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరడం ఒక్కటే ముఖ్యం అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles