భుజాలు తడుముకుంటున్న తోపుదుర్తి!

Monday, December 23, 2024

‘జాకీ సంస్థనుంచి ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే మామూళ్లు డిమాండ్ చేశారు’ అని పత్రికల్లో వచ్చిన వెంటనే రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంజాయిషీ ఇచ్చుకుంటున్నారు. తాను సొమ్ములు అడిగానా లేదా అనే సంగతి కాదు.. అసలు జాకీ అనే కంపెనీ నే మంచి కంపెనీ కాదు అని ఆయన కౌంటర్ ఆరోపణలు చేస్తున్నారు. జాకీ సంస్థ మీద నిందలు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవహారం అంతా గమనించినప్పుడు గుమ్మడికాయల దొంగ ఎవరు అనగానే భుజాలు తడుముకున్న చందంగా కనిపిస్తోంది.

అనంతపురం జిల్లా రాప్తాడు ప్రాంతంలో జాతీయ సంస్థ 28 ఎకరాలలో అండర్ గార్మెంట్స్ తయారీ యూనిట్ ప్రారంభించడానికి గత ప్రభుత్వ హయాంలో సిద్ధపడిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత వైఎస్ఆర్ సీపీ ప్రజాప్రతినిధులు లంచాలు డిమాండ్ చేయడం వల్ల వారు స్థలాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించేసి వెనక్కి వెళ్ళిపోయినట్టుగా తాజాగా వెలుగు చూసింది. రాప్తాడులో ఒకటి అనుకున్నది కాస్త తెలంగాణలో రెండు యూనిట్లు ప్రారంభించడానికి ఒప్పందం కుదుర్చుకుంటున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఈ దందాల బాగోతాన్ని ఈనాడు వెలుగులోకి తేవడంతో.. రాజకీయంగా అంతా రచ్చ రచ్చ అవుతోంది.

అందరికంటే ముందు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి భుజాలు తడుముకుంటున్నారు. జాకీ అనే సంస్థ సరైన సంస్థ కానేకాదని మాయదారి సంస్థ అని ఆరోపణలు చేస్తున్నారు. వారు కర్ణాటకలోనూ తమిళనాడులోను కూడా కొన్ని యూనిట్లు మూసివేశారు అని అంటున్నారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ లో యూనిట్ ఏర్పాటుకు స్థలాలు తీసుకుని ఇప్పటిదాకా పనులు ప్రారంభించలేదు అని కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటున్నదంటే వారు పునరాలోచించుకోవాలని తెలంగాణను హెచ్చరిస్తున్నారు. 

వ్యవహారం చూడబోతే తన దందాల సంగతి బయట పెట్టినందుకు జాకీ సంస్థను ఈ ఎమ్మెల్యే టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. తెలంగాణలో కూడా వారికి అవకాశం దక్కకుండా దారులు మూసివేయాలని కోరుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. 

ఈ వ్యవహారం వెలుగు చూసిన తర్వాత రాజకీయంగా పెద్ద దుమారమే రేగుతోంది. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోమ వీర్రాజు కూడా ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు. జాకీసంస్థ ఎందుకు వెనక్కు వెళ్లిపోయిందో సంజాయిషీ చెప్పాలని, వివరణ ఇవ్వాలని ఆయన ఆ లేఖలో ముఖ్యమంత్రిని కోరారు. రాద్ధాంతం ఇప్పుడే షురూ అయింది. గతంలో చాలా సందర్భాలలో వైసిపి ఎమ్మెల్యేలు మంత్రుల అవినీతి భాగోతాల గురించి చాలా స్పష్టమైన ఆధారాలతో వార్తలు వచ్చాయి. ఏ ఒక్కరి విషయంలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోలేదు సరి కదా.. గుమ్మనూరు జయరాం వంటి వాళ్లకు మంత్రి పదవిని రెండోసారి కూడా ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అవినీతి భాగోతాలు మరింతగా పరువు తీస్తాయి కాబట్టి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles