ఈసారి తప్పించుకోవడం అవినాష్‌కు అంత వీజీ కాదు!

Saturday, November 16, 2024

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు అత్యంత అసహ్యమైన నీచమైన అసభ్యమైన పోస్టులను తమ తమ ఖాతాల్లో పెట్టి ఉండవచ్చు గాక. కానీ.. ఆయా దుర్మార్గమైన ఆలోచనలకు అసలు కర్తలు వారు కాదు. తమకు వచ్చిన కంటెంట్ ను వారు తమ తమ అకౌంట్లలో పోస్టు చేశారే తప్ప.. అంత నీచత్వానికి సృష్టికర్తలు కాదని ఇప్పటిదాకా సాగుతున్న విచారణల్లో తేలుతోంది. అంతమాత్రాన వారు శిక్షల నుంచి తప్పించుకోవడం అనేది అసాధ్యం. కానీ.. అసలు మూలవిరాట్టులకు, సూత్రధారులకు శిక్షపడకుండా, కేవలం ఈ లాస్ట్ లెవెల్ కార్యకర్తలకు శిక్షలు పడడం కూడా కరెక్టు కాదు.

మరైతే సూత్రధారులు ఎవరు? ఇప్పటిదాకా సాగుతున్న విచారణలు.. అరెస్టు అయిన వారు వెల్లడిస్తున్న వివరాలను బట్టి.. తొలి పెద్దతలకాయగా.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేరు వినిపిస్తోంది. అవినాష్ రెడ్డి, ఆయన పీఏ రాఘవరెడ్డి నుంచే తనకు కంటెంట్ వచ్చేదని.. తాను తన ఖాతాలో పోస్టు చేసేవాడినని పులివెందులకు చెందిన వర్రా రవీందర్ రెడ్డి పోలీసు విచారణలో వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే అవినాష్ కు అప్పుడే నోటీసులు ఇవ్వడానికి గానీ, విచారణకు పిలవడానికి గానీ పోలీసులు పట్టించుకోవడం లేదు. ముందు ఆయన పీఏ రాఘవరెడ్డిని పట్టుకునే ఉద్దేశంతో ఉన్నారు. ఆయన వారం కిందటే పరారవగా ప్రస్తుతానికి సెర్చ్ వారెంట్ కూడా జారీ చేశారు. నేడో రేపూ ఆయన దొరకడం గ్యారంటీ. రాఘవరెడ్డి దొరికితే.. అవినాష్ రెడ్డి పాత్ర గురించి ఇంకా సాలిడ్ ఆధారాలు దొరుకుతాయనేది పోలీసుల ఆలోచనగా కనిపిస్తోంది.

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇప్పటికే.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు. జగన్మోహన్ రెడ్డికి ప్రియమైన తమ్ముడు! ఆయన తనకు ఎంతటి ప్రేమాస్పదమైన తమ్ముడో జగన్ పలుమార్లు చాటుకున్నారు. వైఎస్ భారతికి సన్నిహితమైన బంధువు. ఇంతటి కీలక వ్యక్తి గనుక..  ఆయన వివేకా హత్య కేసులో నిందితుడుగా ఉన్నప్పటికీ.. సీబీఐ విచారణ సాగుతున్నప్పటికీ.. సీబీఐ వారిమీదనే విమర్శలతో విరుచుకుపడుతూ.. వారి విచారణకు సహకరించకపోగా వారితోనే ఆడుకోవడమూ అలా జరుగుతూ వచ్చింది. జగన్ ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా హత్య కేసు నుంచి అవినాష్ ను కాపాడడానికే అనే పేరు కూడా మూటగట్టుకున్నారు.

అయితే ఇప్పుడు ఈ సోషల్ మీడియా కేసుల ఉచ్చులో అవినాష్ రెడ్డి పేరు నేరుగా చిక్కుకుంటే ఆయనకు చిక్కులు తప్పవు. సీబీఐ లాగా ఏపీ పోలీసులు ఉపేక్షించకపోవచ్చు. ఆయన కఠినమైన విచారణను ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకు అవినాస్ రెడ్డి సిద్ధంగా ఉండాలని ప్రజలు అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles