వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. భీషణ ప్రతిజ్ఞలు తుస్సుమన్నాయి. ప్రభుత్వం మీద పోరాటం అంటూ ఆయన చేసిన తొలి ప్రయత్నమే బెడిసికొట్టింది. ఆయన మాటల మీద, చేతల మీద కూడా ప్రజల్లో ఏమాత్రం నమ్మకం లేదని, ఆయనను ఇంకా రాష్ట్ర ప్రజలందరూ కేవలం ఒక అవకాశవాదిగానే చూస్తున్నారని, ఆయన మాయమాటలను నమ్మేస్థాయికి ప్రజలు ఇంకా దిగిరాలేదని శుక్రవారం నాడు చాలా స్పష్టంగా అర్థమైంది. రైతుల సమస్యలపై జిల్లాల్లో కలెక్టర్లకు వినతిపత్రం ఇవ్వడం, ధర్నాలు చేయడం అనే కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ ఈ పోరాటాలు తుస్సుమన్నాయి. చాలా జిల్లాల్లో పట్టుమని వందమంది కూడా లేకుండా నాయకులు మొక్కుబడిగా ఈ వినతిపత్రాల సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సాయంత్రానికి వైఎస్ జగన్ ఒక ట్వీట్ చేశారు. ‘‘దగాపాలనపై రైతన్నల తొలిపోరాటం విజయవంతం అయ్యింది. చంద్రబాబు మోసాలను నిలదీస్తూ, అన్యాయాలను ప్రశ్నిస్తూ రైతన్నలు ఇవాళ రోడ్డెక్కారు. రైతులకు తోడుగా నిలిచిన వైయస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు అందరికీ అభినందనలు. ఆరునెలల కాలంలోనే చంద్రబాబుపై ప్రజావ్యతిరేకతకు ఇవ్వాళ్టి కార్యక్రమం అద్దంపట్టింది. దీన్ని అడ్డుకోవడానికి చంద్రబాబుగారు పోలీసులను ఉపయోగించుకుని పార్టీ నాయకులపైన, రైతులపైన హౌస్ అరెస్టులకు, బెదిరింపులకు దిగినా ఎక్కడా వెనకడుగు వేయకుండా, వారు తమ డిమాండ్లు వినిపించడం హర్షణీయం.’’ అంటూ ఒక ట్వీట్ పెట్టేసి జగన్ చేతులు దులుపుకున్నారు.
కానీ వాస్తవంలో ఒకటిరెండు చోట్ల మాత్రం వైసీపీ నాయకులు అసహనంతో ఘర్షణ వాతావరణానికి కారకులు అయ్యారు. అంతే తప్ప ఎక్కడా.. కూడా రైతుల ధర్నాలు సక్సెస్ కాలేదు. జగన్మోహన్ రెడ్డి చాలా ఆడంబరంగా ఈ పోరాటాలకు పిలుపు ఇచ్చారు. ప్రభుత్వానికి ఆరునెలల గడువు ఇచ్చామని అయితే వారు హామీలు నిలబెట్టుకోవడంలేదని, ఇక పోరాటాలే శరణ్యమని ఆయన ప్రకటించారు. తొలి పోరాటంగా రైతుల ఉద్యమం ప్రకటించారు. ఇంకా వరుస కార్యక్రమాలు ఉన్నాయి. రైతులకు 20వేల రూపాయల పెట్టుబడి సాయం అందడం లేదనే డిమాండ్ తో ఈ పోరాటాలు చేశారు.
అయితే వైసీపీ చేసిన పోరాటాలు ఎక్కడా దిక్కూమొక్కూ లేకుండా జరిగాయనడానికి అతిపెద్ద ప్రూఫ్ ఏంటంటే.. కనీసం వారి సొంత టీవీ చానెల్లో కూడా ఈ ఉద్యమాలకు సంబంధించి.. కవరేజీ పద్ధతిగా సాగలేదు. చిన్న చిన్న క్లిప్ లు మాత్రమే ప్రదర్శించుకున్నారు. ఎక్కడా ఒక్క డ్రోన్ షాట్ తో కూడా వైసీపీ పోరాటాన్ని చిత్రించలేదు. ఎందుకంటే ఎక్కడా జనం లేరు. డ్రోన్ తో తీస్తే పరువుపోతుందని భయం. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పిలుపు ఇచ్చిన తొలి పోరాటం తుస్సు మంది. ప్రజలు తనను ఆదరిండచం లేదనే సంగతి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా గుర్తిస్తారో లేదోనని ప్రజలు అనుకుంటున్నారు.