మారుమూలపల్లెల్లో కూడా మినీ సూపర్ మార్కెట్లను అందుబాటులోకి తెస్తామని నారా చంద్రబాబునాయుడు ప్రజలకు హామీ ఇచ్చారు. కేవలం మినీ సూపర్ మార్కెట్లుగా.. అన్ని రకాల సరుకులను పల్లెల్లో అందుబాటులో ఉంచడం మాత్రమే కాదు. బయటి మార్కెట్ తో పోలిస్తే బాగా చవకధరలకు అందించే ప్రయత్నం ఇప్పుడు జరుగుతోంది. మారుమూల పల్లెల్లో కూడా ఉండే రేషన్ దుకాణాలనే చవకగా సరుకులు అందించే మినీ సూపర్ మార్కెట్లుగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం అద్భుతమైన ప్రయత్నం చేస్తున్నది.
ఇప్పుడు రేషన్ దుకాణాల్లో నిత్యావసరాల పంపిణీని 1నుంచి 15 వ తేదీ వరకు మాత్రమే ఇస్తున్నారు. అయితే ఈ కాలపరిమితిని తొలగించేస్తున్నట్టుగా మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఏడాదిలో మొత్తం 365 రోజుల పాటు రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయని మంత్రి వెల్లడించారు. నిజానికి పల్లెటూళ్లలో ఈ ఏర్పాటు ప్రజలకు ఎంతో మేలుచేస్తుందనే చెప్పాలి. గతంలో జగన్ హయాంలో ఇళ్ల వద్దకే రేషన్ సరఫరా అనే ముసుగులో.. వారు వాహనం తీసుకుని వచ్చేరోజుల్లోనే ప్రజలందరూ సరుకులు తీసుకోవాలనేది నిబంధన. అలా ఒకటిరెండురోజుల్లో పంపిణీ చేయడం ఎవరైనా ఆ సమయంలో ఇళ్లలో ఉండలేక సరుకులు తీసుకోకపోతే.. వారికి పూర్తిగా నిరాకరించడం జరిగేది. అంటే రోజువారీ కూలీ పనులకు వెళ్లే గ్రామీణులు.. ఈ సరుకుల కోసం పనులు మానుకుని ఇళ్లలో ఉండాల్సి వచ్చేది. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఈ కష్టం తొలగిపోయింది. 1 నుంచి 15 వ తేదీవరకు ఎన్నడైనా వెళ్లి సరుకులు తీసుకునేలా రేషన్ దుకాణాల్లో దొరికే ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ కాలపరిమితి కూడా తీసేసి నెలపొడవునా ఎప్పుడైనా సరే సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించింది.
రేషన్ బియ్యంతో పాటు పప్పు,నూనె వంటి సరుకులు కూడా ఇస్తున్నారు. వచ్చే నెలనుంచి గోధుమపిండిని కూడా సబ్సిడీ ధరలపై రేషన్ దుకాణాల ద్వారా ఇవ్వబోతున్నట్టుగా నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. నెలపొడవునా దుకాణాలను తెరచి వుంచడం వల్ల దుకాణదారులకు కూడా లాభాలు పెరిగే ఆలోచన చేస్తున్నట్టు నాదెండ్ల ప్రకటించడం విశేషం. నెస్లే, కోకకోలా వంటి కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నామని.. పెద్దకంపెనీలనుంచి సరుకులు కొనుగోలుచేసి.. మార్కెట్ ధరకంటె తక్కువకు వినియోగదారులకు అందేలా చూడాలని భావిస్తున్నట్టు నాదెండ్ల ప్రకటించడం విశేషం. ఆర్గానిక్ ఉత్పత్తులను కూడా రేషన్ దుకాణాల ద్వారా అందుబాటులోకి తెస్తామని అంటున్నారు. ఈ ప్రయత్నాలన్నీ కార్యరూపం దాలిస్తే.. నెమ్మదినెమ్మదిగా రాష్ట్రంలోని రేషన్ దుకాణాలు.. చిన్న స్థాయి మినీ సూపర్ మార్కెట్లుగా రూపుదిద్దుకుంటున్నట్టుగా ప్రజలు సంతోషిస్తున్నారు.
