ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడున్నరేళ్లుగా సాగుతున్న పరిపాలనను ఒక్క పదంలో నిర్వచించాల్సివస్తే ‘విధ్వంసం’ అనే మాట గుర్తుకు వస్తుంది. అధికారంలోకి వచ్చిన తొలి నాటి నుంచి ఏదో ఒకటి కూలకొట్టడం మీదనే పాలకుల దృష్టి ప్రధానంగా ఉంటోంది. తెలుగుదేశం పార్టీ నాయకులు అని భావించిన ఇళ్లు, ఆస్తులు, నిర్మాణాలు ఎన్నెన్ని కూలగొట్టారో ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ముద్ర ఉంటుందని చంద్రబాబు నాయుడుకు కీర్తి దక్కుతుందని భావించిన నిర్మాణాలను కూడా సర్వనాశనం చేసేశారు. ఉండవల్లిలో చంద్రబాబు ఇంటి సమీపంలో ప్రభుత్వ ఆస్తి అయిన ప్రజావేదికను కూలగొట్టడం.. ప్రభుత్వం ఓర్వలేనితనానికి, అసూయకు పరాకాష్టగా పేరు తెచ్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్లను మూసేయించి, కూలగొట్టి పేద ప్రజల కడుపు కొట్టింది ఈ ప్రభుత్వం. ఆ దారుణ విధ్వంసకాండలో భాగంగా తాజాగా పచ్చని చెట్లను కూడా సమూలంగా నరికేస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా దారుణమైన ఈ హరిత హననకాండ నడుస్తోంది. ముఖ్యమంత్రి వస్తున్నారంటేనే ఆ ప్రాంతంలో ప్రజల మీద సవాలక్ష ఆంక్షలు వస్తాయి. ప్రజలను రోడ్లమీద నడవనివ్వరు. వ్యాపారులను తమ దుకాణాలు తెరవనివ్వరు. ఊరు ఊరంతా అచ్చమైన కర్ఫ్యూ వాతావరణం ఏర్పడాల్సిందే. ఈ కర్ఫ్యూ మధ్యలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకోసం ఏర్పాటుచేసిన సభా ప్రాంగణం వద్దకు వచ్చి, తనకోసం బలవంతంగా తరలించిన డ్వాక్రా మహిళలను, జనాన్ని ఉద్దేశించి తాను చెప్పదలుచుకున్న నాలుగు మాటలు చెప్పి వెళ్లిపోతారు. ఆ మాత్రం దానికి ఊరు ఊరంతా ఆంక్షలు మాత్రం విపరీతంగా అమలవుతాయి.
నరసాపురంలో అధికారులు కొంచెం అతి చేస్తున్నారు. ఆక్వా యూనివర్సిటీకి శంకుస్థాపన చేయడానికి.. ముఖ్యమంత్రి జగన్ వస్తున్న నేపథ్యంలో.. అన్ని రకాల సాధారణ ఆంక్షలతో పాటు ఊర్లోని చెట్లను కూడా వారు నరికేయడం ఘోరం. నరసాపురం రీజినల్ ఆసుపత్రి వద్ద కొన్ని దశాబ్దాలుగా నిరుపేదలకు నీడనిస్తున్న పెద్ద చెట్టును కూడా సమూలంగా నరికేయడం స్థానికులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ముఖ్యమంత్రి పర్యటించే మార్గం కాకపోయినా కూడా రోడ్డు పక్కన ఉండే చెట్లను నరికేస్తున్నారు. సీఎం జగన్, నర్సాపురంలో ఎక్కడా విడివిడిగా పర్యటించడం లేదు. సభా ప్రాంగణంలోనే బటన్ నొక్కి అన్ని కార్యక్రమాలు పూర్తిచేస్తారు. అయినా, ఆయన దారమ్మట వెళుతుండగా రీజనల్ ఆసుపత్రిని చూడడానికి ‘వ్యూ’కు అడ్డం వస్తున్నదని అతిపెద్ద చెట్టును తొలగించడం విమర్శలకు గురవుతోంది.
నరసాపురం మునిసిపాలిటీ అధికారులు ఈ చెట్లను తెలుగుదేశానికి చెందినవిగా భావిస్తున్నారేమో.. ఇంత దారుణంగా కూల్చేస్తున్నారని ప్రజలు జోకులు వేసుకుంటున్నారు.