సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. 10 గంటలకు సమావేశాలు మొదలు కావడానికి ముందే.. ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో బడ్జెట్ ను కేబినెట్ ఆమోదిస్తుంది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెడతారు. అయితే ఈ సమావేశాలకు తమ పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదని జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్సీలు మాత్రం మండలి సమావేశాలకు హాజరవుతారుట. ఒక సభలో ఒకలాగా, మరో సభలో మరొకలాగా తమ పార్టీ వ్యవహార సరళిని నిర్దేశించడం ద్వారా.. జగన్మోహన్ రెడ్డి తనలోని రెండు బుద్దులను, రెండు నాలుకల ధోరణిని బయటపెట్టుకుంటున్నారని ప్రజలు అంటున్నారు.
ఇంతకూ జగన్ తాము అసెంబ్లీకి హాజరు కాబోయేది లేదని ఎందుకు అన్నారో ప్రజలకు గుర్తుండే ఉంటుంది. తనకు ప్రతిపక్ష నేతగా హోదా ఇవ్వలేదు గనుక.. తాను సభకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్టు జగన్ ప్రకటించారు. ప్రతిపక్ష నేత హోదా ఉంటే తప్ప సభలో ప్రజా సమస్యలను ప్రస్తావించడం సాధ్యం కాదని ఆయన ఒక అబద్ధపు డైలాగు చెప్పారు. హోదా లేకపోతే స్పీకరు తనకు మైకు ఇవ్వరు అని కూడా చెప్పారు. జగన్ కు ప్రతిపక్ష హోదా లేకపోతే ఆయన టీం మొత్తం ఎందుకు గైర్హాజరు కావాలో ఆయన వద్ద లాజిక్ లేదు. అయితే ఆయన చెబుతున్న రీజన్ కేవలం అబద్ధం మాత్రమే అని ఆయన చేతలే నిరూపిస్తున్నాయి.
శాసనమండలిలో వైసీపీకి అంతో ఇంతో ఘనంగా బలం ఉంది. అధికార కూటమి కంటె ఎక్కువ మంది సభ్యులున్నారు. మండలిలో బొత్స సత్యనారాయణ వైసీపీ పక్షనాయకుడిగా ఉన్నారు. అక్కడ మాత్రం ఆ పార్టీ సభ్యులు హాజరవుతారట.
ఈ నిర్ణయాలను బట్టే స్పష్టంగా తేలిపోతున్నది. ప్రతిపక్షహోదా ఇవ్వలేదు గనుక.. సభకు వెళ్లను అని జగన్ చెబుతున్నది కేవలం బుకాయింపు. మండలిలో ఆ పార్టీకి బలం ఉన్నది గనుక.. వెళుతున్నారు. అసెంబ్లీలో కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు గనుక.. అంత తక్కువ మందితో సభలో కూర్చోవడాన్ని జగన్ చాలా పెద్ద అవమానంగా భావిస్తున్నారు గనుక.. ఆయన సభకు వెళ్లడం లేదు. ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. తన కనీస బాధ్యతను నిర్వర్తించకుండా సభకు డుమ్మా కొడుతున్న జగన్ వైఖరి ప్రజల్లో విమర్శలకు గురవుతోంది.