వైఎ్సార్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఏపీ ప్రజలు అంత దారుణంగా ఎందుకు ఛీకొట్టారో ఈ ఒక్క ఉదాహరణ చూస్తే చాలు చక్కగా అర్థమైపోతుంది. ఈ ఉదాహరణ గురించి చెప్పుకోవాలంటే ముందుగా ఒక కథ చెప్పుకోవాలి.
ఓ కపట భక్తుడు ఉన్నాడు. ఆ ప్రబుద్ధుడికి గుడికి వెళ్లడం అలవాటు.. దేవుడి మీద భక్తి కాదు. గుడిలో పెట్టే రుచికరమైన ప్రసాదాల మీద మోజు. ఒకనాడు వాడు కొత్తగా చెప్పుల జత కొన్నాడు. అవి వేసుకుని గుడికి వెళ్లాడు. రద్దీ కూడా బాగానే ఉంది. వెళ్లి దేవడి ఎదుట నిల్చున్నాడు. క్యూలైను పెద్దగా ఉంది. అంతా పూర్తయి, దేవుడి దర్శనం కూడా అయితే గానీ.. ప్రసాదం దొరకదు. ఈలోగా వాడికి గుడిబయట వదలిన చెప్పులు ఎవడైనా ఎత్తుకుపోతాడేమో అని భయం పట్టుకుంది.
అక్కడినుంచి అసలు చూపు కూడా దేవుడి మీద నిలవడం లేదు. చీటికీ మాటికీ వెనక్కు తిరిగి గుడి ప్రధాన ద్వారం వైపు చూసుకుంటున్నాడు. ఈలోగా దేవుడి ఎదుటకు వచ్చాడు. ‘మంచి లగ్నంలో దేవుడి ఎదుటకు వచ్చావు.. నీ మనసులో కోరిక చెప్పు నాయనా.. తప్పక నెరవేరుతుంది’ అన్నాడు. ఆ ప్రబుద్ధుడు వెనక్కి వెనక్కే చూసుకుంటూ.. దేవుడి వైపు కూడా చూడకుండా.. ‘నా చెప్పులు ఎవరూ ఎత్తుకుపోకుండా చూడు సామీ’ అని గట్టిగా అడిగాడు. ‘ఛీ దరిద్రుడా.. నిన్ను ఎవరూ బాగు చేయలేరు ఫో’ అని కసురుకుని పూజారి పంపేశాడు. వాడి దైవదర్శనం పూజ కూడా పనికి రాకుండాపోయింది- చెప్పుల మీది ధ్యాసతో.
జగన్ పరిస్థితి అలాగే ఉంది. మిర్చి రైతులు కష్టాల్లో ఉన్నారు.. ఓకే! ఆయన వెళ్లి వారిని పరామర్శించారు. డబుల్ ఓకే! కానీ బయటకు వచ్చిన దగ్గరినుంచి ఆ పార్టీ కేవలం జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించలేదు అనే అంశం గురించి మాత్రమే మాట్లాడుతున్నది! రాష్ట్రంలో మీడియా ముందుకు రాగల యాక్సెస్ ఉన్న ప్రతి వైసీపీ నాయకుడు కూడా.. జగన్మోహన్ రెడ్డికి సరైన భద్రత ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారు..అని మాత్రమే నిందిస్తున్నారు.
ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి నాలుగడుగులు ముందుకేసి.. రాష్ట్రప్రభుత్వం భద్రత ఇవ్వడంలో విఫలమైంది గనుక కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని ప్రధానికి, హోంమంత్రికి లేఖ కూడా రాసేశారు. ప్రస్తుతం వైసీపీ నాయకులు ఎవ్వరికీ మిర్చి రైతుల గోడు కనిపించడం లేదు. కేవలం జగన్ పర్యటనలో పోలీసుల్ని పెద్దగా మోహరించలేదు అనే పాయింట్ మాత్రమే కనిపిస్తోంది.
ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యేగా మిగిలిన తర్వాత.. ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తనకు ముఖ్యమంత్రితో సమానంగా భద్రత కల్పించాలంటూ.. హైకోర్టులో పిటిషన్ కూడా వేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. రైతుల గోడు యార్డులోనే వదిలేసినట్టుగా.. ఇప్పుడు మళ్లీ భద్రత కోసం గోల చేయడం చాలా చీప్ గా ఉంది.