విశాఖ కూటమి పరమే.. వారిని ఆపలేకపోయారు!

Sunday, March 23, 2025

విశాఖలో పరువు నిలబెట్టుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రకరకాల ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. ఎక్కడకూ వెళ్లబోయేది లేదు.. వైసీపీలోనే ఉంటాం.. అని కార్పొరేటర్లతో పదేపదే చెప్పిస్తూ తమ తమ మీడియా సంస్థల్లో ఊదరగొడుతున్నా కూడా.. వెళ్లేవారిని ఎవ్వరూ ఆపలేకపోతున్నారు. విశాఖపట్నం మునిసిపల్  కార్పొరేషన్ మేయర్ మీద అవిశ్వాస తీర్మానానికి తెలుగుదేశం రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీకి చెందిన ఆరుగురు కార్పొరేటర్లు లోకేష్ సమక్షంలో కూటమి పార్టీల్లో చేరారు. మరో ఆరుగురు శుక్రవారం చేరబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.విశాఖ నగరం వైసీపీ చేజారడాన్ని ఎవ్వరూ ఆపలేరని పరిశీలకులు అంటున్నారు.

సార్వత్రిక ఎన్నికలు ముగిసిన దగ్గరినుంచీ విశాఖలో వైఎస్సార్ కాంగ్రెస్ కు గడ్డు రోజులు మొదలయ్యాయనే చెప్పాలి. విశాఖ నగరాన్ని ఎంతో ఉద్ధరించేస్తున్నట్టుగా జగన్ ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ అక్కడి ప్రజలు నమ్మలేదు. దారుణంగా ఓడించారు. ఆ తర్వాత వైసీపీ కార్పొరేటర్లకు కూడా జ్ఞానోదయం కాసాగింది. వైసీపీని నమ్ముకుంటే.. రాజకీయ భవిష్యత్తు ఉండదనే సంగతి వారికి అర్థం కాసాగింది. ఒక్కొక్కరుగా కూటమి పార్టీల్లోకి చేరిపోసాగారు. తాజాగా తెలుగుదేశంలోకి 9 మంది, జనసేనలోకి ముగ్గురు చేరడానికి నిర్ణయించుకోగా.. వారిని కట్టడి చేయడానికి వైసీపీ అగ్రనేతలు రంగంలోకి దిగారు.

బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాధ్, కురసాల కన్నబాబులను ఇందుకోసం వైసీపీ అధిష్ఠానం ప్రత్యేకంగా నియమించింది. తమ కార్పొరేటర్లను లాక్కోవడం ఎవ్వరికీ సాధ్యం కాదని గుడివాడ చాలా ఆర్భాటంగా ప్రకటించారు. బొత్స అసెంబ్లీ సమావేశాల కారణంగా.. వీరిని దువ్వడానికి సమయం వెచ్చించారు. గుడివాడ, కన్నబాబు కలిసిచేసిన ప్రయత్నాలన్నీ ఫలించలేదు.
అయిదుగురు కార్పొరేటర్లు కెల్ల సునీత, గేదెల లావణ్య, భూతిరాజు సునీత, చల్లా రజని, ముర్రువాణి లు అమరావతిలో పల్లా శ్రీనివాసరావు సమక్షంలో  తెలుగుదేశం కండువాలు కప్పుకున్నారు. మరో కార్పొరేటరు మాసిపోగు మేరీజోన్స్ జరనసేనలో చేరారు.

వీరి చేరికతో జీవీఎంసీలో కూటమి పార్టీల బలం 60కి చేరినట్లు అయింది. మరో ఆరుగురు కార్పొరేటర్లు కూడా వైసీపీని వీడి టీడీపీ జనసేనల్లోకి శుక్రవారం చేరుతారని స్థానికంగా వినిపిస్తోంది. దాంతో కూటమి బలం 66 అవుతుంది. వీరు కాకుండా ఎక్స్ అఫీషియో సభ్యులుగా కూటమికి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఒక ఎమ్మెల్సీ మొత్తం 11 మంది ఉన్నారు. అంతా కలిపి కూటమి బలం 77 అవుతుంది.
ప్రస్తుతం విశాఖ మేయరుగా గొలగాని హరివెంకటకుమారి ఉన్నారు. ఆమె మీద అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 74 మంది సభ్యుల బలం అవసరం అవుతుంది. కూటమి చాలా సౌకర్యవంతమైన బలంతో కనిపిస్తోంది. శుక్రవారం ఆరుగురి చేరికతో లాంఛనం పూర్తవుతుందని.. ఇక అవిశ్వాసం పెట్టి.. విశాఖను చేజిక్కించుకోవడమే తరువాయి అని తెలుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles