ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రతి సభలోనూ క్లాస్ వార్ గురించి మాట్లాడుతూ ఉంటారు. రాబోయే ఏడాదిలో రాష్ట్రంలో జరిగేది కురుక్షేత్ర యుద్ధం అని, పాండవులు ఒకవైపు కౌరవులు ఒక వైపు నిలిచి పోరాడబోతున్నరని అంటూ ఉంటారు. రాబోయే ఎన్నికలు పేదలకు పెత్తందార్లకు ధనికులకు మధ్య జరిగే యుద్ధం అని అభివర్ణిస్తుంటారు. తాను పేదవాడిని అని తనకు, శత్రువులకు ఉన్నట్టుగా సంపదలు, పత్రికలు, టీవీ చానెళ్లు లేవని అంటూ ఉంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్ప పేదవాడో అసలు సంగతిని ఆనం వెంకటరమణ రెడ్డి ఆధారాల సహా బయట పెట్టారు.
ఒక్క భారతి సిమెంట్స్ కంపెనీలో జగన్ , ఆయన భార్య భారతి లకు కలిపి 4 వేల కోట్ల రూపాయల విలువైన వాటాలు ఉన్నాయని ఆనం వివరించారు. ఆ కంపెనీలో 51 శాతం వాటా ఉన్న ఫ్రెంచ్ కంపెనీ డైరెక్టర్ జీతం ఏడాదికి 33 లక్షలు కాగా, భారతి మాత్రం అలవెన్సులు కలిపి 3.90 కోట్లు తీసుకుంటున్నారని బయట పెట్టారు. ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా సిమెంట్ కంపెనీ ని ఎలా సొంతం చేసుకోవచ్చో జగన్ ఒక ఉదాహరణ చూపించారని అన్నారు.
భారతి సిమెంట్స్ ఒక్కటే కాదని, జగన్ దంపతులకు 17 కంపెనీలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. తాను పేదవాడిని అని జగన్ చెప్పుకునే మాటలు.. రాష్ట్రంలో ఒక్కరు కూడా నమ్మేవి కాకపోవచ్చు గానీ.. ఆధారాలు, పత్రాలతో సహా జగన్ మాటల డొల్ల తనాన్ని ఆనం వెంకటరమణ రెడ్డి బయట పెట్టడం విశేషం.
ఒకవైపు బెంగుళూరు, హైదరాబాదు, తాడేపల్లిలలో వందల కోట్ల విలువైన అత్యంత విలాసవంతమైన నివాసభవనాలను కలిగి ఉంటూ కూడా, విశాఖలో క్యాంపు ఆఫీసు పేరిట ప్రభుత్వం సొమ్ముతో మరో ఖరీదైన భవనాన్ని సిద్ధం చేయించుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఎన్నికల అఫిడవిట్లో మాత్రం తనకు ఒక్క ఇల్లు కూడా లేదని, ఒక్క కారు కూడా లేదని వివరాలు సమర్పిస్తూ ఉంటారు. సాంకేతికంగా ఆయనకున్న సంపదలేవీ అచ్చంగా ఆయన పేరు మీద ఉండకపోవచ్చు గాక. కానీ.. అఫిడపిట్లో ఆస్తులు లేవని చెప్పినంత మాత్రాన.. ఆయన పేదవాడు అంటే.. రాష్ట్రంలో ఆయనను అభిమానించే ప్రజలైనా నమ్ముతారో లేదో తెలియదు. కానీ అదే నినాదాన్ని పట్టుకుని జగన్ పదేపదే చెప్పుకుంటూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు.. ఆయన ఆస్తుల చిట్టా మొత్తం ఆనం వెంకటరమణారెడ్డి బయటపెట్టడం చర్చనీయాంశంగా ఉంది.