వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన కాలంలో.. ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగిన ఐపీఎస్ అధికారి, తెలుగుదేశం పార్టీ వారిని వేధించడంలోను, జగన్ అనుకూల దందాలను నడిపించడంలోనూ కీలకంగా వ్యవహరించిన వ్యక్తి, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు ను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడకు తరలించి విచారిస్తున్నారు. ఆయనకు వైద్య పరీక్షలు చేయించి, కోర్టులో ప్రవేశపెట్టి రిమాండుకు పంపే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆయన ముంబాయికి చెందిన నటి కాదంబరి జత్వానీ మీద తప్పుడు కేసు బనాయించి, కుటుంబం మొత్తాన్ని వేధించిన కేసులో అరెస్టు అయ్యారు. అరెస్టు అయిన తర్వాత పీఎస్సార్ ఆంజనేయులు మీద మరో కేసు కూడా నమోదు అయింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ ను తుపాకీతో బెదిరించారంటూ గుంటూరు సిఐడీ పీఎస్ లో పోలీసులు ఇంకో కేసు నమోదు చేశారు. అలాగే రఘురామక్రిష్ణ రాజు గతంలో ఎంపీగా ఉన్న సమయంలో ఆయన మీద జరిగిన హత్యాయత్నం కేసులోనూ పీఎస్సార్ పేరుంది. ఈ కేసుల్లో కూడా పీటీ వారెంటు ద్వారా ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. కేసుల్లో తన పేరు ప్రముఖంగా ఉన్నప్పటికీ.. కాదంబరి జత్వానీ కేసులో నిందితులైన మరో ఇద్దరు ఐపీఎస్ లు కాంతిరాణా తాతా, విశాల్ గున్నీ విచారణలో తన పేరునే కీలకంగా చెప్పినప్పటికీ.. పీఎస్సార్ ఆంజనేయులు ఇప్పటిదాకా ముందస్తు బెయిలు కోసం దరఖాస్తు కూడా చేయలేదు. పోలీసులు తలచుకుంటే ఆయనను ఎప్పుడో అరెస్టు చేసి ఉండవచ్చు. కానీ.. మంగళవారం నాడు తెల్లవారు జామునే అరెస్టు చేయడం వెనుక ఒక వ్యూహం, ఇతర లక్ష్యాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కాదంబరి జత్వానీ కేసులో ఆంజనేయులు ఆల్రెడీ సస్పెండ్ అయి ఉన్నారు. ఆయన నగరం దాటి వెళ్లకూడదని నిబంధనలు చెబుతున్నప్పటికీ.. హైదరాబాదులో ఉంటూ.. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు పోలీసులకు చిక్కకుండా కోర్టుల్లో కేసులు వేయడానికి, నోటీసులకు సమాధానాలు ఇవ్వడానికి తానొక మాస్టర్ బ్రెయిన్ లాగా హెల్ప్ చేస్తున్నారనే ప్రచారం ఉంది. ఐటీ సలహాదారు అయిన తనను లిక్కర్ స్కామ్ లో విచారణకు పిలవడానికి సిట్ కు అధికారమే లేదంటూ రాజ్ కెసిరెడ్డి మెయిల్ పంపిన ధిక్కారం వెనుక, కోర్టును ఆశ్రయించిన పిటిషన్లో చూపిన కారణాల వెనుక ఆంజనేయులు ఉన్నారని పలువురు అనుమానిస్తున్నారు.
సోమవారం సాయంత్రం రాజ్ కెసిరెడ్డిని అరెస్టు చేసిన నేపథ్యంలో వైసీపీ పెద్దలందరూ తర్వాతి పరిణామాల గురించి చర్చోపచర్చలు సాగించి, తర్వాత అనుసరించాల్సిన వ్యూహాల గురించి మేథోమధనం సాగించే అవకాశం ఉంది. ఆ చర్చల్లో పీఎస్సార్ ఆంజనేయులు బ్రెయిన్ అందుబాటులో లేకుండా ఉండడానికే మంగళవారం తెల్లవారుజామున ఆయనను అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది. రాజశేఖర రెడ్డి అరెస్టు తర్వాత.. వ్యూహరచన చేసుకోవడంలో వైసీపీ పెద్దలను గందరగోళానికి గురిచేసే ఉద్దేశంతోనే మంచి టైమింగ్ లో ఆంజనేయులును అరెస్టు చేశారని పలువురు అనుకుంటున్నారు.
