ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుపరిపాలనలో తొలిఅడుగు అనే కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తోంది. అదే సమయంలో తిరుమల వేంకటేశ్వరస్వామి వారి సేవలో.. ధర్మ ప్రక్షాళనకు కూడా తొలి అడుగు పడింది. క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తూ.. తిరుమల తిరుపతి దేవస్థానాలలో విధులు నిర్వర్తిస్తున్న నలుగురిపై టీటీడీ సస్పెన్షన్ వేటు వేసింది. వీరు టీటీడీ ప్రవర్తన నియమావళిని పాటించడం లేదని సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా.. తిరుమలేశుని సేవలో అన్యమతస్తులు లేకుండా చూస్తామని, తద్వారా హిందూ ధర్మాన్ని అనుసరించే వారి మనోభావాలు దెబ్బతినకుండా కాపాడుతామని కూటమి ప్రభుత్వం చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకునే దిశగా తొలి అడుగు పడినట్లు అయింది.
టీవీ 5 ఛానెల్ అధినేత బి.ఆర్ నాయుడు.. తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలికి సారథిగా నియమితులైనప్పుడే.. తొలి ప్రసంగంలోనే ఈ విషయంలో తన విధానాన్ని, ఆలోచనను చాలా స్పష్టంగా బయటపెట్టారు. తిరుమలేశుని సేవలో అన్యమతస్తులను ఏరివేస్తామని, తద్వారా దైవద్రోహం జరగకుండా చూస్తాం అని బిఆర్ నాయుడు స్పష్టీకరించారు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా వేర్వేరు సందర్భాల్లో టీటీడీ పరిధిలో అన్యమతస్తులు ఉండరాదని, అలాంటివారిని ఏరివేయాలని పిలుపు ఇచ్చారు. పాలకమండలి కూడా.. అన్యమతస్తులందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని, తప్పుకోవాల్సి ఉంటుందని పలుమార్లు హెచ్చరించింది. అయితే వారంతట వారుగా ముందుకొచ్చిన వారు ఇప్పటిదాకా లేరు.
కొన్నిరోజుల కిందట ఒక టీటీడీ అధికారి తన స్వగ్రామంలో క్రిస్టియన్ చర్చికి వెళ్లి ప్రార్థనల్లో పాల్గొంటుండగా అధికారులకు ఫిర్యాదు అందింది. అదే విధంగా మరో అధికారి టీటీడీ కల్యాణ మండపానికి తనిఖీలకు వెళ్లినప్పుడు.. క్రిస్టియన్ వాక్యాలు ఉన్న కారులో వెళ్లి వివాదంలో చిక్కుకున్నారు. అతనికి కూడా నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా టీటీడీ వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న నలుగురు ఉద్యోగులను తాజాగా సస్పెండ్ చేశారు. క్వాలిటీ కంట్రోల్ లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరుగా పనిచేస్తున్న బి.ఎలిజర్, బర్డ్ లో స్టాఫ్ నర్స్ గా ఉన్న ఎస్. రోసి, బర్డ్ లోనే గ్రేడ్ వన్ ఫార్మసిస్ట్ గా ఉన్న ఎం. ప్రేమావతి, ఆయుర్వేద ఫార్మసీలోని డా.జి.అసుంత లను సస్పెండ్ చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానాల ఉద్యోగుల్లో ఇంకా వందల సంఖ్యలో అన్యమతస్థులు ఉన్నట్టుగా ప్రచారం ఉంది. ప్రత్యేకించి గత ప్రభుత్వ హయాంలో అనేకమంది అన్యమతస్తులు అడ్డదారుల్లో ఉద్యోగాలు పొందినట్టుగా కూడా అప్పట్లో వివాదాలు రేగాయి. వీరు.. ప్రత్యేకించి.. అన్యమత ప్రచారం చేసే వారిని తిరుమలకు తీసుకువెళ్లి, అక్కడ వారితో ప్రార్థనలు చేయించడం వంటి వివాదాస్పద పనులకు పాల్పడినట్టు కూడా గత ప్రభుత్వ హయాంలో ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు టీటీడీ పాలకమండలి అన్యమతస్తులందరినీ ఏరివేయడానికి కంకణం కట్టుకున్నట్టుగా చర్యలు తీసుకుంటుండడం పట్ల భక్తుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
