రాజకీయ నాయకులకు బోలెడు మంది అభిమానులు ఉంటారు. ఆ నాయకుడు తమకు ఏం చేస్తాడా? కాంట్రాక్టుల్లోదోచుకోవడానికి ఏం అవకాశం ఇస్తాడా? అని ఎదురుచూస్తుంటారు? మహా అయితే నాయకుడి బర్త్ డే రోజున ఫ్లెక్సిలు కడతారు.. రవ్వంత అన్నదానమూ, కొందరు రక్తదానమూ కూడా చేస్తారు. కానీ.. నాయకుడు ప్రజల పట్ల ఎలాంటి నిబద్ధతను, ఎలాంటి సేవాతత్పరతను కలిగిఉన్నాడో.. ప్రజలకు ఏ రీతిగా ఉపయోగపడాలని అనుకుంటున్నాడో.. ఆ సంకల్పాన్ని, బాధ్యతను, భారాన్ని పంచుకునే అభిమానులు, కార్యకర్తలు ఉండరు. జనసేనాని పవన్ కల్యాణ్ కు ఉన్న అసలైన బలం అదే. ఆయన అభిమానులు ఆయన సంకల్పాన్ని కూడా పంచుకుంటారు. అందుకు తమ అభమానాన్నే ప్రాతిపదికగా మార్చుకుంటారు. జనసైనికులు.. “జల్సా” చిత్ర ప్రదర్శన ద్వారా కోటి రూపాయల విరాళం సేకరించి అభిమానం చాటుకున్నారు.
పీ.ఏ.సీ. సభ్యులు నాగబాబు చేతుల మీదుగా పవన్ కళ్యాణ్ కు చెక్ అందజేశారు.
జనసేనాని పుట్టిన రోజు నాడు “జల్సా” సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. ఈ టికెట్ విక్రయాల ద్వారా.. పార్టీ పిలుపు ఇచ్చిన “నా సేన కోసం నా వంతు” అనే కార్యక్రమానికి కోటి విరాళం సేకరించారు.
పవన్ కల్యాణ్ మీద ఉండే అభిమానం అనేది.. తమ హీరోతో కలిసి ఫోటో దిగితే చాలు అనుకునే స్థితినుంచి.. కోటిరూపాయలు సేకరించి.. తమ నాయకుడి ద్వారా.. రాష్ట్రానికి ప్రజలకు అండగా ఉండాలని అనుకునేంతగా ఎదిగిందని ఈ సందర్భంగా నాగబాబు అనడం విశేషం.
జనసేన పార్టీ స్వచ్ఛందంగా అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఎందరికో అండగా నిలబడుతోంది. పార్టీకి కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి. అందరు రాజకీయ నాయకుల్లా కాకుండా.. నన్ను గెలిపిస్తే నేను అది చేస్తా.. ఇది చేస్తా.. అని చెప్పడం కాకుండా.. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పవన్ కల్యాణ్ అండగా నిలబడుతున్నారు. ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల నగదు తాను స్వయంగా అందజేస్తున్నారు. ఇలా ప్రతిసందర్భంలో ఏదో ఒక కార్యక్రమానికి, ప్రజలకు అండగా నిలబడుతున్నారు. పార్టీకి కోట్ల రూపాయల వ్యయం అవుతోంది.
ఈ సేవా కార్యక్రమాల కోసం నిధులు సమీకరించడానికి ‘నా సేన కోసం నా వంతు’ పేరుతో విరాళాలు ఇవ్వాలని పార్టీ పిలుపు ఇచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి చిన్నా పెద్దా విరాళాలు అందుతూనే ఉన్నాయి. ఆ క్రమంలోనే పవన్ పుట్టినరోజు నాడున జల్సా సినిమా ప్రదర్శించి.. స్పెషల్ షో టికెట్లు విక్రయించారు. ఆ మొత్తం కోటిరూపాయలను పవన్ కు అందజేశారు. పవన్ అభిమానుల బలం అంటే ఎలా ఉంటుందో వారు నిరూపించారు.