ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ సొంత ఆస్తిని కాపాడుకోవడానికి నానా పాట్లు పడుతూ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వేధింపులను ఎదుర్కొంటూ ఇబ్బంది పడిన ఎన్నారై ప్రముఖుడు కుదరవల్లి శ్రీనివాసరావు విషయంలో ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరించిందో ఆంధ్రవాచ్ డాట్ కామ్ పాఠకులకు తెలుసు. కుదరవల్లి శ్రీనివాసరావును ఏకంగా కోర్టు ఆవరణలోనే పోలీసుల సహాయంతో కిడ్నాప్ చేయడానికి కొందరు భూ బకాసురులు ప్రయత్నించడం సంచలనంగా చర్చల్లోకి వచ్చిన సంగతి కూడా అందరికీ తెలుసు. సదరు కుదరవల్లి శ్రీనివాసరావు తనకు ఎదురైన అనుభవాలన్నీ అమెరికన్ కాన్సులేట్ అధికారులకు వివరించి మరీ, తక్షణం అమెరికా వెళ్ళిపోయారు. ఏపీలో ప్రభుత్వ అరాచకాలపై అంతర్జాతీయంగా పరువు పోతోందని పలువురి విమర్శలు కూడా వినవచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్నారై కుదరవల్లి శ్రీనివాసరావుకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ నిలబడుతోంది.
పేదలకు సేవ చేయడం కోసం స్థాపించిన ముప్పవరపు చౌదరి – లీలా రామకృష్ణ ప్రసాద్ ట్రస్ట్ భూములను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ వర్ల రామయ్య ఆరోపిస్తున్నారు. ఈ ట్రస్ట్ వ్యవహారాలు చూస్తున్న ఎన్ఆర్ఐ కుదరవల్లి శ్రీనివాసరావు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా వారు వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. దీనికి సంబంధించి వైసీపీ నేతలు వారికి సహకరించిన పోలీసుల మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ కు శనివారం వర్ల రామయ్య లేఖ రాశారు.
ఈ ట్రస్టు భూములు కృష్ణాజిల్లా కానూరు, యనమలకుదురు, తాడిగడపల్లో ఆరు ఎకరాలకు పైగా ఉన్నాయి. సుమారు 100 కోట్ల రూపాయల విలువచేసే ఆ భూములను కాజేయడానికి స్థానిక నాయకులు ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం ఆరోపిస్తోంది. తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని, దీంతో ఆయన రాష్ట్రం విడిచి అమెరికాకు వెళ్లిపోయారని.. వర్ల మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. కుదరవల్లి శ్రీనివాసరావు ఎక్కడ ఉన్నారో చెప్పాలంటూ ఆయన కుమార్తెను కూడా వైకాపా నాయకులు వేధిస్తున్నారని ఆరోపించారు.
ఈ ట్రస్టు భూముల విషయంలో వైసిపి నేతలు అనుసరిస్తున్న ధోరణి, జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కూడా ప్రభుత్వ అరాచకత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నారై కు సంబంధించిన వ్యవహారం కావడంతో.. అమెరికా తెలుగు వర్గాలలో కూడా ఈ విషయంపై ప్రముఖంగా చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు , ఆస్తుల కల్పన అంటేనే ఎన్నారైలు భయపడే వాతావరణం ఏర్పడుతోందని ప్రజలు అనుకుంటున్నారు.