ఒక రకంగా చెప్పాలంటే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు.. అవినీతి కేసుల్లో అరెస్టుల పర్వం ఏ క్షణాన తనదాకా వస్తుందో అనే భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రత్యేకించి మూడున్నర వేల కోట్ల రూపాయల ప్రజాధనం కాజేసిన లిక్కర్ కుంభకోణంలో కీలకమైన పాత్రధారులందరూ అరెస్టు అయి ప్రస్తుతం రిమాండులోనే ఉంటున్నారు. వీరు తలకిందులుగా తపసు చేస్తున్నా సరే.. వీరికి బెయిలు కూడా లభించడం లేదు. వీరు బయటకు వస్తే చాలు.. మొత్తం సాక్ష్యాలను తారుమారు చేసేయగలరనే సిట్ వాదనలకే కోర్టు మొగ్గు చూపుతోంది. ఇప్పటికే పలువురి విచారణలో సూత్రధారిగా జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా స్పష్టంగానే తేలిన నేపథ్యంలో ఆయన అరెస్టు కూడా ఎప్పుడైనా జరగవచ్చునని ఊహాగానాలు ఉన్నాయి. అయితే.. రెండు రాష్ట్రాల రాజకీయాల గురించి సమానమైన అవగాహనతో, సాధికారంగా మాట్లాడుతూ ఉండే.. ఒక తెలంగాణ నాయకుడు మాత్రం.. జగన్ అరెస్టు అయి మళ్లీ జైలుకు వెళ్లడానికి డెడ్ లైన్ ప్రకటించేస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలందరికీ పరిచయం ఉండే తెలంగాణ నాయకుల్లో గోనె ప్రకాశ్ రావు కూడా ఒకరు. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డికి తెలంగాణలో ఆత్మీయులైన నాయకుల్లో ఒకరు. అప్పట్లో వైఎస్ ఆయనకు ఆర్టీసీ ఛైర్మన్ పదవిని కూడా కట్టబెట్టారు. వైఎస్ కు దగ్గరి వారైన తెలంగాణ నాయకుల్లో ఒకరుగా.. ఆయన రాజకీయ ప్రత్యర్థుల మీద అప్పటినుంచి కూడా విరుచుకుపడుతూనే ఉండేవారు. కానీ.. వైఎస్ మరణానంతర రాజకీయ డ్రామాల్లో ఆయన జగన్ కోటరీలోకి రాలేదు. స్వతంత్రంగా ఉండిపోయారు. కానీ.. సీనియర్ నాయకుడు కావడం వలన.. ఉండవిల్లి అరుణ్ కుమార్ తరహాలో రాజకీయాల గురించి సాధికారంగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి గోనె ప్రకాశరావు.. తాజాగా తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి.. జగన్ అరెస్టు అయ్యే డెడ్ లైన్ ప్రకటించారు.
మద్యం కుంభకోణం జగన్ రెడ్డి మెడకు పూర్తిగా చుట్టుకుంది. సెప్టెంబరు నెలాఖరులోగా జగన్ అరెస్టు కావడం పక్కా.. అని గోనె అనడం గమనార్హం. సిట్ పోలీసుల వద్ద జగన్ పాత్రకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలున్నాయని, ఈసారి జగన్ ను అరెస్టు చేయడానికి బీజేపీ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. కానీ జగన్ ను అరెస్టు చేసే విషయంలో చంద్రబాబునాయుడే ఆచితూచి వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ పాలన కాలంలో టీడీఆర్ బాండ్ల రూపంలో వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, ఈ దందాలపై కూలంకషంగా దర్యాప్తు జరగాలని గోనె ప్రకాశరావు కోరుతున్నారు. వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక విషయంలో.. జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమి వైపు ఉండకుండా.. తమ ప్రత్యర్థులైన ఎన్డీయే అభ్యర్థికి మద్దతిస్తూ అటూ ఇటూ కాని వాళ్ల లాగా వ్యవహరిస్తున్నారని విమర్శించడం విశేషం.
