తెలంగాణ శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ చెప్పుకోదగిన స్థాయిలో విజయాలను నమోదు చేస్తుందా లేదా? అనేది ఇంకా సందేహం గానే ఉన్నది కానీ.. గెలిచేది తామేనని, అధికార పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని ప్రచారం చేసుకుంటూ ముమ్మరంగా సభలను నిర్వహిస్తూ ఆర్భాటం చేయడంలో మాత్రం ఆ పార్టీ ముందున్నది. ఇప్పటిదాకా సభలనే సమీకరణాలుగా లెక్కవేస్తే గనుక అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి, అధికారంలోకి రాగలమని అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీల కంటే భారతీయ జనతా పార్టీ ఎక్కువ సంఖ్యలో భారీ బహిరంగ సభలు నిర్వహించింది. ముందు ముందు కూడా మరిన్ని సభలు నిర్వహించే ఆలోచనతోనే ఉంది. నవంబర్ లోగా తెలంగాణలో ఏకంగా 30 భారీ బహిరంగ సభలు నిర్వహించడం ద్వారా పార్టీలో ఊపు తీసుకురావాలని నిర్ణయించారు.
ప్రస్తుతం తెలంగాణలో రెండు భారీ బహిరంగ సభలు- కార్యక్రమాలలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా పాల్గొంటున్నారు. ఇల్లందు, పాలమూరులలో ఆయన పాల్గొనే బహిరంగ సభలు ఉంటాయి. ఈనెల 10వ తేదీ న హోం మంత్రి అమిత్ షా కూడా రాష్ట్రానికి రానున్నట్టుగా పార్టీ వర్గాల ప్రకటించాయి. ఆయన ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్లాన్ చేసి అందుకు తగిన వేదికను అన్వేషించే పనిలో పడ్డాయి. ఇప్పటికే ఖమ్మం హైదరాబాదులో బహిరంగ సభలు నిర్వహించారు. ఇప్పుడు మరొక ప్రాంతంలో మూడో బహిరంగ సభ నిర్వహించాలని వ్యూహంతో ఉన్నారు. సభలను ఏదో ఒక విధంగా నిర్వహించగలుగుతున్నారు కానీ, జనాన్ని పోగేయగలుగుతున్నారు గాని.. ఓట్ల రూపంలో పార్టీకి బలాన్ని పెంచడంలో భారతీయ జనతా పార్టీ విఫలం అవుతున్నది. ఆ పరంగా చూసినప్పుడు అధికారంలోకి రావడం కాదు కదా, కనీసం గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు సాధించడం కూడా బిజెపికి కష్టమే అని విశ్లేషకులు భావిస్తున్నారు. సీట్లకు తగిన బలం లేకపోయినా ప్రచార పర్వంలో కేంద్ర నాయకులను మోహరిస్తూ వారు చేస్తున్న ఆర్భాటం మాత్రం దండిగానే ఉంది.
అయితే తెలంగాణ మీద పెడుతున్న కాన్సెంట్రేషన్ మొత్తం కేవలం అసెంబ్లీ ఎన్నికల కోసం మాత్రమే కాదని, వచ్చే ఏడాది జరిగే పార్లమెంటు ఎన్నికలు నాటికైనా తమకు ఓట్లు దక్కితే చాలుననే ఉద్దేశంతో అనుసరిస్తున్న వ్యూహమేనని పలువురు భావిస్తున్నారు. బలం లేని తెలంగాణ వంటి రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల కోసం ఆరాటపడడం కంటే, అంతో ఇంతో దక్కగల పార్లమెంటు స్థానాల కోసం ఇప్పటినుంచే దృష్టి పెట్టడం మంచిదనేదే బిజెపి వ్యూహం అనే అంచనాలు సాగుతున్నాయి. ఇలాంటి అడ్డదారి తెలివితేటలను తెలంగాణ ప్రజలు ఏ రకంగా ఆమోదిస్తారో వేచి చూడాలి.