కొత్త పార్టీతో తె-రాజకీయంలో ఇక తీన్మార్!

Sunday, January 19, 2025

పదునైన మాటలతో సునిసితమైన విమర్శలతో వ్యాఖ్యానాలతో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు చికాకు పుట్టించే జర్నలిస్టు, యూట్యూబ్ తీన్మార్ మల్లన్న ప్రస్తుతం కొత్త రాజకీయ పార్టీ ప్రారంభిస్తున్నారు. కల్వకుంట్ల చంద్రశేఖర రావు మీద అలుపెరగని, మడమతిప్పని పోరాటం సాగిస్తూ ఉండే తీన్మార్ మల్లన్న..  రాజకీయ ఆరంగేట్రం కోసం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ చివరికి సొంత పార్టీ ఏర్పాటుకు సిద్ధం కావడం గమనార్హం.  

అయితే తీన్మార్ మల్లన్న పెట్టబోయే పార్టీ అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితికి ఎంత మేరకు చేటు చేస్తుంది?. ఎంత మేరకు లాభం చేకూరుస్తుంది? అనేది ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే,  తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత రాజకీయాలలో ప్రజల మీద ప్రభావం చూపించగల ఏ కొత్త పార్టీ ఎన్నికల బరిలోకి వచ్చినా సరే..  ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి..  కేసిఆర్ కు లాభం జరుగుతుంది అన్నది అందరూ ఒప్పుకోవాల్సిన సంగతి. . ఇప్పటికే కేసీఆర్ పాలన పట్ల ఉండే ప్రజా వ్యతిరేకతను చీల్చడానికి ప్రధానంగా కాంగ్రెస్, బిజెపి తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినప్పటికీ పరిమితంగా కొన్ని చోట్ల అయినా, పరిమితంగా కొన్ని ఓట్లు అయినా చీల్చగల పార్టీలు మరికొన్ని రంగంలో ఉంటాయి.  

ఇలాంటి నేపథ్యంలో తన యూట్యూబ్ ఛానల్ ద్వారా చేసే ఆరోపణలతో విస్తృత ప్రజాదరణ కలిగి ఉన్న తీన్మార్ మల్లన్న పార్టీ పెడితే జరిగేది వ్యతిరేక ఓట్లను చీల్చడమే కదా అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.  తీన్మార్ మల్లన్న వీడియోలకు,  కేసీఆర్ మీద ఆయన విమర్శలతో విరుచుకు పడే ధోరణికి ఉండగల అభిమానులు ఎవరైనా సరే వారందరూ కేసీఆర్ వ్యతిరేకులే.  ఆల్రెడీ కాంగ్రెస్ లేదా భారతీయ జనతా పార్టీతో అనుబంధం,  ఆ పార్టీల పట్ల అభిమానం కలిగి ఉంటారు.  తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టినంత మాత్రాన ఆయన వీడియోలకు ఎన్ని వ్యూస్ వస్తాయో అన్ని ఓట్లయినా ఆయన సంపాదించగలగడం సాధ్యమేనా?  అనే చర్చ కూడా రాజకీయ వర్గాలలో నడుస్తోంది. 

తన యూట్యూబ్ వీడియోలు, విమర్శల ద్వారా తీన్మార్ మల్లన్న ఏ స్థాయిలో ప్రభుత్వాన్ని చికాకు పెడుతూ వచ్చారంటే..  రాష్ట్రంలో మరే ఇతర జర్నలిస్టును కూడా టార్గెట్ చేయనంత ఘోరంగా ప్రభుత్వం ఆయన మీద కక్ష కట్టిందా అని ప్రజలు అనుమానించే పరిస్థితి వచ్చింది.. ఆయన మీద అనేక పోలీసు కేసులు నమోదు అయ్యాయి. ఒక కేసులో  బెయిలు తెచ్చుకుంటే ఈలోగా మరొక కేసులో అరెస్టు చేసేవారు.  ఇలా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు.

భారాస ప్రభుత్వ వేధింపులు తాళలేక, తీన్మార్ మల్లన్న భారతీయ జనతా పార్టీలో చేరడం కూడా జరిగింది.  ఆ పార్టీ ఆయనకు తొలుత ఇచ్చిన హామీలు ఎలా ఉన్నప్పటికీ… ఆ పార్టీ ఆయనకి ఇచ్చిన ప్రాధాన్యం మాత్రం ఏమీ లేదు. కొద్ది రోజుల్లోనే బిజెపి నుంచి బయటకు వచ్చిన తీన్మార్ మల్లన్న రకరకాల ప్రయత్నాల తర్వాత ఇప్పుడు కొత్త పార్టీ పెట్టడానికి సిద్ధమవుతున్నారు.  తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతో రిజిస్టర్ చేయడానికి ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం తమ వెబ్సైట్ లో కూడా పేర్కొన్నది. . మరి కొత్త పార్టీ ద్వారా తీన్మార్ మల్లన్న ఏం సాధిస్తారో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles