ఎన్నికలు ఇంకా ఏడాది దూరంలో రానున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటినుంచే రాజకీయ ప్రత్యర్థులను ఏకంగా అడ్డు తొలగించుకునే ప్రయత్నాలు ప్రారంభించారా? అధికారంలోకి వచ్చిన నాటినుంచి విధ్వంసమే రాజనీతిగా పాలన సాగిస్తున్న వాళ్లు .. ఇప్పుడు హత్యలకు బరి తెగిస్తున్నారా? అనే అనుమానాలు పుడుతున్నాయి. కాకినాడ జిల్లా తునిలో తెదేపా నాయకుడు పొల్నాటి శేషగిరిరావు పై పట్టపగలు ఇంటివద్దనే జరిగిన హత్యాయత్నం.. రాష్ట్ర ప్రజలందరిలోనూ భయం పుట్టిస్తోంది.
మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావు విష్ణుమాలలో ఉన్నారు. ఆయన ఇంటికి భవానీ మాలలోని ఒక భక్తుడు భిక్షకోసం వచ్చాడు. శేషగిరిరావు బియ్యం తెచ్చి వేయబోతుండగా.. భిక్ష తీసుకుంటూనే.. తాను దాచి ఉంచుకున్న పెద్ద కత్తి బయటకు తీసి ఆయన మీద దాడి చేశాడు. తలమీద కొట్టాడు. కిందపడిపోయిన శేషగిరిరావు తలపై మళ్లీ నరికాడు. వెంటనే పారిపోయాడు. భవానీ మాల ధరించిన వేషంలో ఉన్న హంతకుడు.. తువ్వాలును మూతికి అడ్డంగా చుట్టుకుని వచ్చాడు. సీసీ టీవీలో హత్యకు యత్నించిన వైనం చాలా పక్కాగా రికార్డు అయింది.
వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అనుచరులే ఈ హత్యకు యత్నించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగన్ రెడ్డి గొడ్డలిపోటును మంత్రులు, ఎమ్మెల్యే లు వారసత్వంగా తీసుకున్నారని తెలుగుదేశం అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. వైసీపీ ఆగడాలకు అడ్డుగా నిలబడి, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను నిలదీసే టీడీపీ నేతల గళాలపై అణిచివేసేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. తుని నియోజకవర్గంలో కాపులకు అన్యాయం చేస్తున్న వైసీపీ చర్యలను నిలదీస్తున్నందుకే శేషగిరిరావును చంపడానికి ప్రయత్నించారు. కాపు సామాజికవర్గంపై జగన్ రెడ్డి, వైసీపీ నాయకులు గొడ్డళ్లతో వేటాడుతున్నారు. హత్యలు, దాడులు చేసి బెదిరించే ఈ దుష్ట ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసి, ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి. హత్యాయత్నం చేసిన వారిని, చేయించిన వారిని కటకటాల వెనక్కి పంపే వరకు బాధితుల తరపున పోరాడుతామని అచ్చెన్నాయుడు అన్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. రాష్ట్రవ్యాప్తంగా అదుపుతప్పుతున్న శాంతి భద్రతల పరిస్థితి గురించి.. ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఆ మధ్య వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవరును హత్యచేస్తే.. పోలీసులు ఇప్పటిదాకా ఆ కేసును ఒక కొలిక్కి తేలేకపోతున్నారు. ఇప్పుడు తెదేపా నేత హత్యకు యత్నిస్తే.. ఇందులో ఇంకెన్ని మతలబులు ప్రవేశపెడతారో అని ప్రజలు అనుకుంటున్నారు. రాజకీయంగా ప్రత్యర్థులను ఎదుర్కోలేక.. ఏకంగా వారిని అంతం చేసే రాజకీయాలకు అధికార పార్టీ తెగబడుతోందనే భయం ప్రజల్లోకి వెళుతోంది.