తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ చాలా దయనీయంగా తయారైంది. పార్టీ నాయకులు చాలా వరకు పార్టీని వీడి ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. పార్టీలో మిగిలిన కీలకమైన సీనియర్లు చాలా తక్కువ మంది మాత్రమే. 119 మంది ఎమ్మెల్యే సభలో తెలుగుదేశానికి ప్రాతినిధ్యం లేదు. ఏదైనా ఎన్నికల్లో పోటీచేస్తే.. సరైన ఓటు శాతం దక్కడం లేదు. అన్ని రకాలుగా ప్రతికూలతలే కనిపిస్తున్నాయి.ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశానికి పగ్గాలు చేపట్టడమే ఒక సాహసం అని చెప్పాలి. సీనియర్ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆ పని చేశారు. పార్టీని పూర్వవైభవం దిశగా అడుగులు వేయించడానికి తన కష్టం తాను పడుతున్నారు. అందులో భాగంగానే.. డిసెంబరు 21న తెలుగుదేశానికి ఒకప్పట్లో కంచుకోట వంటి ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగసభ నిర్వహించాలని ఆయన నిర్ణయించారు.
ఇతరత్రా ప్రభుత్వ వైఫ్యలాలను నిరసనించే ప్రకటనలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నా లాంటి నిరసనలు చేయడాలూ, ప్రెస్ మీట్ లు పెట్టడాలూ ఇవన్నీ ఒక ఎత్తు. అయితే ఏకంగా బహిరంగ సభ నిర్వహణకు పూనుకోవడం అంటే.. ఇప్పుడున్న బలసంపదల దృష్ట్యా సాహసమే అని చెప్పాలి. ఎందుకంటే బహిరంగ సభ అంటేనే భారీ జనసమీకరణ ఉండాలి. అలా జనసమీకరణ లేకపోతే.. పార్టీకి జరిగే మేలుకంటె నష్టమే ఎక్కువ. పార్టీ బలహీనంగా ఉన్నదనే సంగతిని వారే చాటుకుంటున్నట్టుగా ఉంటుంది. అలాంటి దుస్థితి దాపురించకుండా.. ఖచ్చితంగా భారీస్థాయిలో జనాన్ని సమీకరించాలి. డబ్బుతో ఇవాళ ఆ పని సాధ్యం కావొచ్చు గానీ.. ఆ జనాన్నంతా కదలకుండా ఉంచగలిగి.. సభలో నేతలు చెప్పే మాటలు వినేలా చేయగలిగి.. సభ సక్సెస్ అనిపించగలిగితే.. ఆ సాహసం ఫలించినట్టే.
తెలంగాణలో తెలుగుదేశానికి ఇప్పుడు శాసనసభలో సీట్లు లేకపోవచ్చు గాక.. జరుగుతున్న ఎన్నికల్లో ఓటు శాతం గణనీయంగా కనిపించకపోవచ్చు గాక. కానీ.. ప్రజల్లో ఆ పార్టీ పట్ల తొలినాటినుంచి ఉన్న ఆదరణ చాలా వరకు స్థిరంగానే ఉన్నదనే సంగతి నిజం. ఎన్నికల్లో గెలవగలిగే అభ్యర్థులు కనిపించకపోతున్నందువల్ల సదరు తెలుగుదేశం అభిమానులు కూడా ఇతర పార్టీలకు ఓట్లు వేస్తున్నారు. అయితే పార్టీ బలంగానే ఉన్నదని.. అభిమానించే వారందరూ ఆదరిస్తే ఎన్నికలలో విజయం సాధించడం కూడా జరుగుతుందని ఒక నమ్మకాన్ని వారిలో కలిగిస్తే ఖచ్చితంగా ఓట్లు బాగానే వస్తాయి. బహిరంగ సభ సక్సెస్ అయి జనం బాగా వస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా తమలోని తెలుగుదేశం అభిమానాన్ని మరుగున పెట్టేసుకున్న అనేకమందికి ఆ పరిణామం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.మరి ఈ బహిరంగ సభ అనే సాహసంలో కాసాని జ్ఞానేశ్వర్ ఏ మేరకు సక్సెస్ సాధిస్తారో చూడాలి.