చిన్నమ్మ మాట నిజమైతే లాభమెంత? నష్టమెంత?

Monday, January 20, 2025

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీచేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఆమె స్పష్టత ఇచ్చారు. నిజానికి తెలుగుదేశం- జనసేన మధ్య పొత్తులు కన్ఫర్మ్ అయి.. ఆ రెండు పార్టీలు ఉమ్మడి సమావేశాలు రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడు జనసేన జట్టులో మేం కూడా తప్పకుండా ఉంటాం అని బిజెపి సారథి ప్రకటించడం విశేషం. అదేజరిగి.. మూడు పార్టీలు కలిసి పోటీచేస్తే.. 2014 నాటి విన్నింగ్ కాంబినేషన్ రిపీట్ అవుతుందా? అనే అభిప్రాయాలు ఒకవైపు వినిపిస్తున్నాయి.
నిజానికి తెలుగుదేశంలో.. బిజెపితో కలిసి పోటీచేయడం గురించి పెద్దగా ఆసక్తి లేదు. 2014 నాటి పరిస్థితి వేరు. కానీ నేటి పరిస్థితి వేరు అని వారు భావిస్తున్నారు. మోడీ మీద విమర్శలు చేయడం వారి లక్ష్యం కాదు గానీ.. బిజెపితో కలిసి వెళ్లడం వల్ల పెద్దగా ఉపయోగం లేదని భావిస్తున్నారు. పైగా.. బిజెపితో బంధం ముడిపెట్టుకుంటే తెలుగుదేశం పార్టీకి ముస్లిం వర్గంలో ఉండే బలమైన ఓటుబ్యాంకు దూరం అవుతుందనేది కూడా వారి భయం. అదే సమయంలో.. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వంతో చాలా మంది బిజెపి నాయకులు లాలూచీ రాజకీయాలు నడుపుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారితో కలిసి ఎన్నికలకు వెళ్లడం అనేది ఆత్మహత్యా సదృశం అవుతుంది కదా అనేది కూడా వారి భయంగా ఉంది.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని పవన్ కల్యాణ్ పదేపదే చాలా నమ్మకంగా చెబుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకోసమే.. చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి అవసరం అంటూ ఆయన తెలుగుదేశానికి తమ మద్దతు ప్రకటించి కలిసి అడుగులు వేస్తున్నారు. బిజెపిని కూడా ఒప్పించి తెదేపా కూటమిలోకి తీసుకువస్తానని ఆయన గతంలో పలుమార్లు ప్రకటించారు. ప్రస్తుతం పురందేశ్వరి ప్రకటన పవన్ ప్రయత్నాల ఫలితమేనా అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
భాజపా కు ఉన్న ఓటు బ్యాంకు పరిమితమే అయినప్పటికీ.. నాయకులుగా ముద్రపడిన వారి సంఖ్య ఎక్కువ. ఈ నేపథ్యంలో వారి ఓటుబ్యాంకు అనుగుణంగా కాకుండా.. అతిగా వారు సీట్లు కోరుకునే అవకాశం ఉంటుంది. అది తెలుగుదేశం పార్టీకి నష్టం చేస్తుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. జనసేనతో పొత్తు ఎటూ కుదిరింది గనుక.. ఇక్కడితో ముందుకెళ్తే చాలునని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles