అనగనగా ఒక అడవిలో ఒక గజదొంగ ఉండేవాడు. ఆ అడవిదారిలో ఒంటరిగా వచ్చి పోయే వారిని బలహీనులను బెదిరించి వారిదగ్గర ఉన్నదంతా గుంజుకుంటూ ఉండేవాడు. ఎంతో బలవంతుడైన ఆ గజదొంగను, వాడి చేతిలోని కత్తిని చూడగానే.. బాటసారులు తమసొమ్ములన్నీ అప్పజెప్పి బతుకుజీవుడా అంటూ వెళ్లిపోయేవారు. అలాంటి గజదొంగకు ముసలితనం వచ్చింది. చావు ఆసన్నం అయింది. అప్పుడు కొడుకును పిలిచాడు. కొడుకు కూడా ఇతరత్రా ప్రయోజకుడేమీ కాదు. తండ్రి దొంగతనాలను, దోపిడీలను వారసత్వంగా కొనసాగిస్తున్నవాడే. ఆ కొడుకుతో పెద్ద గజదొంగ తన చివరికోరికను ఇలా చెప్పాడు. ‘‘బతికినంత కాలం జనాన్ని బెదిరించి దోచుకుని బతికాను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఎలాగైనా నాకు మంచి పేరు వచ్చేలా చేయి’’ అని అడిగి చచ్చిపోయాడు.
కొడుకు చాలా ఆలోచించాడు. వాడికి తండ్రి దోపిడీలు కొనసాగించడం తప్ప ఇంకేం తెలియదు. మంచి పేరు తెప్పించడం ఎలాగో తెలియదు. ఆలోచించగా, వాడికి ఒక ఐడియా వచ్చింది. తండ్రి అడవిలో బాటసారులను బెదిరించి డబ్బు తీసుకునేవాడు. వీడు, బాటసారులకు కత్తిచూపించి బెదిరించి సొమ్ము లాక్కోవడంతో పాటు, వారిని నాలుగు తన్ని పంపించే వాడు. డబ్బు ఇచ్చిన తర్వాత కూడా తన్ని పంపేవాడు. దెబ్బలుతిన్న వాళ్లందరూ.. ‘‘వీడికంటె వీడి నాన్న చాలా మంచోడు. డబ్బు తీసుకుని పంపేసేవాడు, వీడు కొడుతున్నాడు’’ అనుకుంటూ వెళ్లేవారు.
ఆహా మా నాన్న మంచివాడని జనం అందరూ అనుకునేలా చేసాను కదా.. అని చిన్న గజదొంగ మురిసిపోయాడు.
== == ==
దొంగలకు సంబంధించినది కేవలం కథ మాత్రమే!
కానీ ఎందుకో, మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థల మీద రాష్ట్ర రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ వారు చేస్తున్న దాడులు, తనిఖీలు గమనిస్తోంటే.. ఈ కథ గుర్తుకు వస్తోంది.
తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి.. గడ్డిపోచను మంత్రించి బాణంగా ప్రయోగించిన తరహాలో.. వార్డు మెంబరుగా కూడా గెలవలేని మేధావి ఉండవిల్లి అరుణ్ కుమార్ ను, మార్గదర్శిమీద దాడికి పురిగొల్పి విడిచిపెట్టారు. రామోజీని చికాకు పెట్టడం ఒక్కటే ఆయన లక్ష్యం. ఆ ఉండవిల్లి ఇప్పటిదాకా ఒక్క నేరం నిరూపించలేకపోయినా.. ఇంకా మార్గదర్శిని పట్టుకునే వేళ్లాడుతున్నారు.
ఇప్పుడు కొడుకు జగన్మోహన్ రెడ్డి.. తండ్రిని మించిపోయాడు. తాను అధికారంలో ఉన్నాడు గనుక.. ప్రభుత్వాధికారులతో దాడులు చేయిస్తూ.. మార్గదర్శిలో మోసాలు జరుగుతున్నాయని నిరూపించే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రజలనుంచి ఫిర్యాదులు రాకపోయినా.. ప్రాసెస్ లో భాగంగా తాము తనిఖీలు నిర్వహించాం అని అధికారులు చెప్పడం విశేషం.
రామోజీ రావును చికాకుపెట్టడం ఒక్కటే వైఎస్ఆర్ లక్ష్యమైతే.. రామోజీ రావును, ఆయన గ్రూపు వ్యాపార సంస్థలను మొత్తంగా భ్రష్టు పట్టించడం జగన్ లక్ష్యంగా కనిపిస్తోంది. మరి ఇలాంటప్పుడు కొడుకు కంటే.. తండ్రి బెటర్ అని అనిపించకుండా ఎందుకుంటుంది?