చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి కేంద్రప్రభుత్వం అందిస్తున్న సాయం చూసి.. వైఎస్సార్ పార్టీకి కన్ను కుడుతున్నట్టుగా ఉంది. డబుల్ ఇంజిన్ సర్కారు సారథ్యంలో రాష్ట్రం ఏ కొంత అభివృద్ధి సాధించినా సరే.. తమ పార్టీకి ఇక ఎప్పటికీ పుట్టగతులు ఉండవనే ఆందోళన ఆయనలో కనిపిస్తోంది.
రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న మద్దతు చేస్తున్న సాయం పట్ల రాష్ట్రమంతా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతోంటే.. విజయసాయి మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
కేంద్రం అంందించే రుణసాయం, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, రాయితీలు ఇవేవీ కూడా తమకు వద్దే వద్దని అంటున్నారు. వాటి బదులుగా ప్రత్యేకహోదా కావాలని ఆయన అంటుండడం గమనార్హం.
ఎక్స్ ఖాతాలో నిత్యం పులిలా రెచ్చిపోతూ ఉండే విజయసాయి తాజాగా ఒక ట్వీట్ పెట్టారు. అందులో కేంద్ర బడ్జెట్ ను రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఒక మాటలగారడీ అని అభివర్ణించారు. అలాగే.. ప్రత్యేక ప్యాకేజీ , రాయితీలు ఏవీ వద్దని, కేవలం ప్రత్యేకహోదా కావాలని ఆయన అంటున్నారు. విజయసాయికి గానీ, ఆయన ఉన్న పార్టీకి గానీ నిజంగానే హోదా మీద అంత మక్కువ ఉన్నట్లయితే.. 22 మంది లోక్ సభ ఎంపీలు గెలిచినప్పుడు ఎందుకు నోరుమూసుకుని అయిదేళ్లు బతికేశారు..? అనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది.
ఏపీలోని 16 మంది ఎంపీలు కేంద్ర ప్రభుత్వ మనుగడకు కీలకంగా ఉన్నారట. నిజానికి కూటమికి మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిని కేవలం హోదా కోసం మాత్రమే గెలిపించారట. అందుకని వారు సాధించాలట. ఇది విజయసాయి ఉవాచ.
నిజానికి 2019లో కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానన్న జగన్ మాటలు నమ్మి 22 మందిని గెలిపించారు. ఆయన ఏం సాధించారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ తన కేసులు, తన తమ్ముడి మర్డరు కేసు గురించి మాట్లాడుకుని వచ్చేశారనే విమర్శలున్నాయి. పైగా రాజ్యసభలో కేంద్రానికి అవసరమైన ప్రతిసారీ తమ సభ్యులతో ఓటు వేయించారు. ఇప్పుడు చంద్రబాబు కేంద్రం వద్ద తనకు వేరే ఆబ్లిగేషన్లు లేకపోవడం వల్ల.. రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకు వస్తోంటే.. విజయసాయికి భయం వేస్తున్నట్టుంది.