లీగల్ గా ఉండగల అన్ని సదుపాయాలను, రక్షణ వ్యవస్థలను వాడుకుంటూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుకు చుక్కలు చూపిస్తున్న సొంత పార్టీ నాయకుడు ఎంపీ రఘురామక్రిష్ణం రాజు. ఈ ఎంపీ ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతాడా.. అని వైసీపీ సోషల్ మీడియా దళాలందరూ.. భయంభయంగా ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే.. ఆయన ప్రెస్ మీట్ పెట్టిన కొద్దిసేపటికెల్లా వాళ్లు కౌంటర్లు ఇవ్వాలి. అందుకోసం అన్నమాట. అలాంటి రఘురామక్రిష్ణ రాజు.. తమ సొంత పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక కొత్త హోదాను కట్టబెట్టారు. ఆయన పెయింటర్ అట!
ఇంతకూ ఈ మాట ఎందుకు అన్నారో తెలుసా? తెలుగుదేశం హయాంలో నిర్మించిన పక్కాఇళ్ల విషయంలో రఘురామరాజు తన గళమెత్తారు. అప్పట్లో చంద్రబాబు కట్టిన ఇళ్లను ఇప్పటిదాకా లబ్ధిదారులకు స్వాధీనం చేయకుండా కూడా కొన్ని చోట్ల ప్రభుత్వం వేధిస్తున్నదనే ఆరోపణలున్నాయి. కొన్ని చోట్ల ప్రజలకు అందాయి. అయితే.. ఆ భవనాలకు వైసీపీ పార్టీ రంగులు వేసి లబ్దిదారులకు అప్పగించారు. ఈ వైనంపైనే రఘురామరాజు.. తనదైన శైలిలో వెటకారం చేశారు. ఆ భవనాలను తెలుగుదేశం నిర్మిస్తే తమ పార్టీ ప్రభుత్వం పార్టీ రంగులు వేస్తున్నదని అన్నారు. ఆ ఇళ్లకు చంద్రబాబునాయుడు బిల్డర్ అయితే.. వైఎస్ జగన్ పెయింటర్ అని ఎద్దేవా చేశారు.
పేదప్రజలకు ఇళ్లు నిర్మించి ఇచ్చే విషయంలో జగన్ సర్కారు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. జగన్ తాను కేటాయించిన స్థలాల్లో జగనన్న ఇళ్లుగా నిర్మించి ఇస్తానన్నవి ఘోరమైన నాణ్యత ప్రమాణాలతో.. అసలు ఇళ్లు అప్పగిస్తే ప్రభుత్వం పరువు పోతుంది అన్నట్లుగా సాగుతున్నాయి. అవి కూడా పూర్తి కావడం లేదు. ఇళ్లు ప్రజలకు ఇచ్చినట్టుగా హడావుడి చేద్దామంటే.. పనులు కావడం లేదు. అదే సమయంలో చంద్రబాబు కట్టిన ఇళ్లనైనా ఇచ్చేసి మైలేజీ తెచ్చుకుందామని ప్రభుత్వం యోచిస్తోంది. అలాంటి సమయంలో.. రఘురామ లాంటి నేతలు.. ఆ ఇళ్లకు జగన్ పెయింటర్ మాత్రమే బిల్డర్ కాదని ఎద్దేవా చేయడం ఆ పార్టీ వారికి పుండుమీద కారం రాసినట్టుగా ఉంటోంది.
రానురాను.. ‘పేదలకు ఇళ్లు’ అనే వ్యవహారం.. జగన్ సర్కారును బాగా బద్నాం చేసేలా కనిపిస్తోంది. ఎందుకంటే.. జగనన్న ఇళ్ల ముసుగులో జరుగుతున్న జరిగిన దారుణాలంటే.. పవన్ కల్యాణ్ ఇప్పుడే బయటకు లాగడం మొదలు పెట్టారు. గుంకలాంలో నిర్మాణంలో నాణ్యత ఎంత ఘోరంగా ఉన్నదో ప్రపంచానికి చూపించారు. రాష్ట్రవ్యాప్తంగా జనసైనికులు ఆ పనిపై పడ్డారు. ఇంకోవైపు పాతఇళ్లు పంచేద్దాం అంటే.. మైలేజీ తెలుగుదేశానికి వెళుతుందని భయం.. మొత్తానికి ‘ఇళ్లు’ అనేవి సర్కారుకు ఇరకాటంగానే తయారయ్యాయి.