ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 371 కోట్ల అవినీతికి పాల్పడినట్లుగా ఆరోపిస్తూ ఆయనను జైల్లో ఉంచి సిఐడి విచారణ జరుపుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేదే పెద్ద బూటకం అని, అసలు సి మెన్స్ తో ఒప్పందం లాంటిదేమీ జరగనేలేదని, ప్రభుత్వం విడుదల చేసిన సొమ్ము మొత్తం చంద్రబాబు నాయుడు కాజేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. డిజైన్ టెక్ అనే కంపెనీ కూడా డొల్ల కంపెనీ అని, చంద్రబాబు నాయుడు దానిని సృష్టించి డబ్బు కాజేశారని అర్థం వచ్చేలాగా మాట్లాడుతున్నారు. అయితే స్వయంగా సీమెన్స్ కంపెనీడిజైన్ టెక్ అనే కంపెనీ తమకు వ్యాపార భాగస్వామి అయిన మాట నిజమేనని చెబుతున్నది. . 2011 నుంచి డిజైన్ టెక్ తో కలిసి సేవలు అందిస్తున్నట్టుగా ధ్రువీకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిజైన్ టెక్ కంపెనీ మీద సిఐడి కేసు నమోదు అయిన తర్వాత మాత్రమే.. వారిని పక్కన పెట్టావని సీమెన్స్ చెబుతోంది.
అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం విచ్చలవిడిగా చంద్రబాబు మీద ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఏ సంస్థలో అయితే అసలు ఒప్పందం జరగనేలేదని అంతా బూటకమని వారు ఆరోపిస్తున్నారో.. ఆ సంస్థ స్వయంగా వచ్చి వివరాలు వెల్లడిస్తున్నప్పటికీ వారు ఆలకించడం లేదు. చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టడం ఒక్కటే లక్ష్యంగా.. చెలరేగిపోతున్నారు.
ఏమీ లేని కేసులో చంద్రబాబు నాయుడు ను అరెస్టు చేయడం మాత్రమే కాకుండా ఆయనను విచారించడానికి ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని సిఐడి కోర్టును కోరడం గమనార్హం. వారి విజ్ఞప్తిని తోసిపిచ్చి, కేవలం రెండు రోజులకు మాత్రమే కోర్టు కస్టడీకి అప్పగించింది. ఈ రెండు రోజుల కస్టడీ విచారణ తర్వాత.. చంద్రబాబు విచారణకు సహకరించడం లేదని, వివరాలు వెల్లడించడం లేదని.. ఆయనను మరికొన్ని రోజులు పాటు విచారించడానికి కస్టడీకి ఇవ్వాలని సిఐడి కోరే అవకాశం ఉంది.
తాము ఏ కేసులు అయితే బనాయించారో.. ఏ నేరారోపణలను చేశారో.. అంగీకరించే వరకు చంద్రబాబును విడిచి పెట్టే ఉద్దేశమే లేనట్లుగా వ్యవహారం సాగుతున్నదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.