షర్మిల.. పోరాటంలో ఒకే ఒక్కరు!

Sunday, October 27, 2024

వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ వైఎస్ షర్మిల తనలోని పోరాటపటిమను ఇప్పుడు పూర్తిస్థాయిలో నిరూపించుకుంటున్నారు. చెల్లెలికి వాటాగా ఇచ్చిన ఆస్తులను, తల్లికి గిఫ్ట్ డీడ్ రూపంలో ఇచ్చిన ఆస్తులను కూడా వెనక్కు తీసుకోవడానికి అసహ్యకరమైన రీతిలో ట్రిబ్యునల్ ను ఆశ్రయించిన జగన్మోహన్ రెడ్డి మీద షర్మిల ఏ ఒక్కరి అండ తీసుకోకుండా.. ఒకే ఒక్కరుగా పోరాటం సాగిస్తున్నారు. జగన్ ప్రాపకం కోసం ఆరాటపడేవారు.. ఆయన గుడ్ లుక్స్ లో ఉండాలని కోరుకునే వారు.. షర్మిల భాషలో చెప్పాలంటే.. ఆయన మోచేతి నీళ్లు తాగేవాళ్లు అనేక మంది.. జగన్ తరఫున షర్మిలను తిట్టిపోయడానికి తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వస్తూనే ఉన్నారు. అయితే.. అవతలి వైపు నుంచి ఎందరు వచ్చినా ఖాతరు చేయడం లేదు. షర్మిల ఒకే ఒక్కరుగా అందరినీ సమర్థంగా ఎదుర్కొంటున్నారు. ప్రతి ఒక్కరి విమర్శలకు జవాబు చెబుతున్నారు.

వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం పరువును, ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి స్వయంగా బజార్లో పెట్టేసిన సంగతి తెలిసిందే. ఏకంగా తల్లి మీదనే ఆయన కోర్టుకు వెళ్లారు. తల్లికి గిఫ్ట్ డీడ్ గా ఇచ్చిన షేర్లనే వెనక్కు తీసుకోవాలని ట్రిబ్యునల్ లో కేసు వేసారు. అక్కడిదాకా వచ్చిన తర్వాత.. షర్మిల కూడా ఊరుకోలేదు. తనకు ఇచ్చిన ఆస్తుల వాటాలను తెలియజెప్పే ఎంఓయూ ఏదో తేరగా ఇచ్చినది కాదని.. తనకు హక్కుగా రావాల్సిందేనని చెబుతూ ఆమె కూడా జగన్ కు లేఖ రాశారు. అక్కడినుంచి ఇద్దరి మధ్య యుద్ధం మొదలైంది.

సరిగ్గా ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. చెల్లెలి ప్రశ్నలకు, విమర్శలకు జగన్ స్వయంగా జవాబు ఇవ్వడం మానుకున్నారు. ఆయన తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి నాయకుడూ మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఎన్నికలకు ముందు జగన్ పదేపదే ఒక సినిమా డైలాగు చెబుతూ ఉండేవాడు. ‘నాన్నా.. పందులు గుంపుగా వస్తాయ్.. సింహం సింగిల్ గా వస్తుంది’ అంటుండేవాళ్లు. తాను ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోను అని చెప్పడానికి ఆయన ఎంచుకున్న డైలాగు అది. ఇప్పుడు కుటుంబ ఆస్తుల విషయంలో మాత్రం అచ్చంగా రివర్సు జరుగుతోంది.

జగన్ ను సమర్థిస్తూ షర్మిలను తిట్టిపోయడానికి ప్రతిరోజూ గుంపులుగా వైసీపీ నాయకులు తయారవుతున్నారు. కానీ.. షర్మిల మాత్రం.. ఒకే ఒక్కరుగా వారందరికీ సమాధానం చెబుతున్నారు. జగన్ మోచేతి నీళ్లు తాగుతున్న వారందరినీ తూర్పారపడుతున్నారు. వైఎస్సార్ మాండేట్ తెలిసిన వైవీసుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి వారి విషయంలో షర్మిల మరింత ఘాటుగానే స్పందిస్తున్నారు. తన గురించి ఎందరు చెడుగా మాట్లాడుతున్నా.. అందరికీ నిర్భయంగా, ధైర్యంగా షర్మిల సమాధానం చెబుతున్న తీరు, ఎదుర్కొంటున్న వైనం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

Previous article
Next article

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles