అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుగా.. అన్న మీద కోపం అన్న మీద చూపించలేక తెలంగాణ రాజకీయాలను తన కార్యక్షేత్రంగా ఎంచుకున్నది వైయస్ షర్మిల! పాపం, ఎందుకు నడుస్తున్నదో నడిచి ఏం సాధించదలచుకుంటున్నదో తనకే క్లారిటీ లేక తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర సాగిస్తున్నది. ఆ పాదయాత్రలో చాలా సహజంగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు మీద ఆయన కుటుంబ పాలన మీద అవినీతి మీద తనకు తోచిన రీతిలో ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నది. అయితే ట్విస్ట్ ఏమిటంటే కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ తెరాసలోని కీలక నాయకులు ఎవ్వరు కూడా షర్మిల యాత్రను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అధికారంలోకి రాగానే నిరుద్యోగాన్ని రూపుమాపుతా, ఒక్క నిరుద్యోగి కూడా లేకుండా చేస్తా అనే తరహా ఆచరణ సాధ్యం కాని, ఆలోచన కూడా లేని హామీలను ప్రజల మీదికి గుప్పిస్తూ చిన్నచిన్న గల్లీలతో సహా షర్మిల తన పాదయాత్ర సాగిస్తూ ముందుకు వెళుతున్నది.
తాజాగా ఒకచోట ఆమె మాటలను గమనిస్తే.. మహిళల పట్ల ఆమెకు ఎంత చులకన భావం ఉన్నదో అర్థమవుతుంది. లేదా రాజకీయాలలో లౌక్యంగా అనే పదం పక్కన పెడితే.. కాస్త జాగ్రత్తగా మాట్లాడడం అనేది అత్యవసరం. అయితే పాదయాత్రకు సిద్ధపడిన షర్మిల దానికి అనుగుణమైన రాజకీయ ప్రసంగాలకు మాత్రం శిక్షణ పొందినట్టుగా లేదు. ఎందుకంటే ఆమె ప్రసంగాలు సాదాసీదాగా ప్రభుత్వం పై ప్రభావం చూపే స్థాయిలో స్థాయి లేకుండా ఉంటాయి.
తాజాగా ఒకచోట షర్మిల పాదయాత్రను టిఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. షర్మిల అంటే వారికి వల్ల మారిన భయం ఏమీ లేదు గాని, కెసిఆర్ ని తిడుతుంటే సహించలేకపోయారు. వివాదం రేగింది దీనికి కౌంటర్ ఇవ్వాలనుకున్న షర్మిల ‘‘టిఆర్ఎస్ నాయకులు ఎవరైనా సరే తను అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్లు మహిళల కంటే తక్కువ’’ అని వ్యాఖ్యానించారు!
ఈ మాటల అర్థం విస్మరించలేం. అయితే ఈ మాటలను లోతుగా గమనిస్తే ‘‘మహిళలు అంటేనే తక్కువ వాళ్ళు’’ అనే భావన షర్మిలకు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. మహిళలు తక్కువ వాళ్ళు అనే అభిప్రాయం ఉన్నందువల్లనే తనను అడ్డుకునే తప్పు చేసే వాళ్ళు మహిళల కంటే చులకన అనే పదం షర్మి ల వాడగలిగింది అనే నిశిత విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. మరి మహిళా లోకం తన మాటల వలన కించపడకుండా షర్మిల ముందుగానే తన తప్పును గుర్తించి సారీ చెబితే బాగుంటుంది.