షర్మిల దీక్ష భగ్నం.. ఈ రణం ఇంతటితో ఆగదు!

Wednesday, January 22, 2025

అందరూ ఊహిస్తున్నట్టే అయింది. పోలీసులు తమకు అలవాటైన శైలిలోనే స్పందించారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ సారథి షర్మిల ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేశారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు. షర్మిల చేపట్టిన దీక్ష మీద శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట సమయంలో పోలీసు చర్య మొదలైంది. పెద్ద సంఖ్యలో లోటస్ పాండ్ కు చేరుకున్న పోలీసులు వైఎస్ షర్మిలను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఆమెను వైద్యం నిమిత్తం జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. నిరసనలను, ప్రభుత్వం పట్ల వ్యతిరేకతలను అణచివేయడంలో కేసీఆర్ సర్కారు తనదైన ముద్రను మరోసారి చూపించినట్లు అయింది. 

తెలంగాణ వ్యాప్తంగా సాగిస్తున్న తన పాదయాత్రను కొనసాగించడానికి అనుమతులు ఇచ్చి తీరాల్సిందేనంటూ వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్న సంగతి తెలిసిందే. ప్రగతి భవన్ ముట్టడి యత్నం అరెస్టు ఎపిసోడ్ తర్వాత.. ఆమె పాదయాత్ర కొనసాగించడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారంటూ తిరస్కరించారు. అయితే తన పాదయాత్రకు అనుమతి ఇచ్చి తీరాల్సిందేనంటూ షర్మిల ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించగా పోలీసులు అరెస్టుచేసి, బలవంతంగా ఇంటికి తరలించారు. ఇంటి ఆవరణలోనే ఆమె తన నిరాహార దీక్ష ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం నుంచే షర్మిల ఆరోగ్యం క్షీణిస్తుండడం గురించిన వార్తలు వస్తున్నాయి. ఇతర వైద్యులతో పాటు వైఎస్ వివేకానందరెడ్డి కూతురు, షర్మిలకు అక్కయ్య డాక్టర్ సునీత కూడా ఆమెను పరీక్షించి ఆందోళన వ్యక్తంచేస్తూ వచ్చారు. శనివారం నాడు.. ఆమె ఆరోగ్యం గురించి డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. షర్మిల మాత్రం మొండిగా తన దీక్ష కొనసాగిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేసి ఆస్పత్రికి తరలించడం గమనార్హం.

అయితే పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. పోలీసులు ఇప్పుడు దీక్ష భగ్నం చేసినంత మాత్రాన షర్మిల పోరాటం ఆగదని తెలుస్తోంది. ఆస్పత్రి నుంచి తిరిగి ఎప్పుడు వస్తే అప్పుడు.. ఆమె మళ్లీ తన ఆమరణ నిరాహార దీక్షను కొనసాగించే ఉద్దేశంతో ఉన్నట్టుగా చెబుతున్నారు. ‘పాదయాత్రకు అనుమతి’ అనే అంశం మీదనే కేసీఆర్ సర్కారుతో అమీతుమీ తేల్చుకోవాలని షర్మిల డిసైడ్ అయ్యారు. పైగా ప్రగతి భవన్ ఎపిసోడ్ తో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన మైలేజీని ఆమె గ్రహించారు. కేసీఆర్ అణచివేత విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటే నిరాహార దీక్ష ఒక మంచి మార్గంగా ఆమె భావిస్తున్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్షను కొనసాగించే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles