వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన కాలంలో సిఐడి చీఫ్ గా ఉంటూ జగన్ కళ్ళలో ఆనందం చూడడానికి ఆయన రాజకీయ ప్రత్యర్థులను వేధించడంలో కీలక భూమిక పోషించిన ఐపీఎస్ అధికారి సంజయ్ కు హైకోర్టు గతంలో ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దయింది. సిఐడి చీఫ్ గా ఎంతో దూకుడుగా వ్యవహరిస్తూ జగన్ ప్రత్యర్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన సంజయ్, అంతకుముందు అగ్నిమాపక శాఖ డైరెక్టర్ గా ఉన్న రోజుల్లో పాల్పడిన అవినీతి కుంభకోణానికి సంబంధించి కేసు నమోదు అయింది. ఈ కేసు విషయంలో పూర్తిగా విచారణ జరపకుండానే హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
సంజయ్ కు ఇచ్చిన ముందస్తు బెయిలు గురించి ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఏసీబీ తరఫు వాదనలను పూర్తిగా వినకుండానే హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేయడంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. సుదీర్ఘ విచారణల తర్వాత ఎట్టకేలకు సంజయ్ ముందస్తు బెయిలుని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీని ఫలితంగా ఈ సీనియర్ ఐపీఎస్ అధికారి మూడు వారాలలోగా కోర్టు ఎదుట లొంగి పోవాల్సి ఉంటుంది. సంజయ్ కస్టడీ కోసం మేజిస్ట్రేట్ కోర్టులో దర్యాప్తు సంస్థ విడిగా పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని అదే విధంగా నిందితుడు సంజయ్ బెయిల్ కోసం కూడా మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించవచ్చునని సుప్రీం తీర్పు చెప్పింది.
నిజానికి ఈ తీర్పు సంజయ్ ఊహించినదే. హైకోర్టులో తనకు వచ్చిన బెయిల్ సుప్రీంకోర్టులో రద్దువుతుందని తెలిసే వీలైనంతవరకు తీర్పు రాకుండా వాదనలను వినిపించకుండా, వాయిదాల మీద వాయిదాలు కోరుతూ ఆయన సాగదీసే ప్రయత్నం చేశారు. ఉద్ధండుడైన సీనియర్ న్యాయవాదిని నియమించుకున్నప్పటికీ ఆయన స్వయంగా కోర్టుకు హాజరు కాకుండా జూనియర్లతో వాయిదాలు కోరడం జరిగింది. ఈ కేసు వాదనలు వినే ప్రక్రియలో భాగంగా ముందస్తు బెయిలు ఇవ్వడానికి హైకోర్టు ఏకంగా 49 పేజీల ఉత్తర్వు ఇవ్వడం పట్ల సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది కూడా . ట్రయల్ మొత్తం అప్పుడే పూర్తి చేసేసారా అని కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
రెండు కోట్లకు పైగా నిధులు దుర్వినియోగం చేసిన ఈ అవినీతి కేసులో నిందితుడైన సంజయ్ ముందస్తు సుప్రీం ఎదుట బుధవారం విచారణ జరగవలసి ఉండగా సీనియర్ న్యాయవాది రాకపోవడంతో వాయిదా కోరారు. గతంలోనూ ఇదే తరహాలో వాయిదాలు కోరుతున్నారని అసహనం వ్యక్తం చేసిన న్యాయమూర్తి గురువారం సీనియర్ రావాల్సిందేనని రాకపోతే ప్రత్యామ్నాయం చూసుకోవాలని హెచ్చరించారు. మొత్తానికి గురువారం నాడు ఈ విషయంలో సుప్రీంకోర్టు ముందస్తు బెయిలు రద్దు చేస్తూ తుది ఉత్తర్వులు ఇచ్చింది. జగన్ రాజకీయ ప్రత్యర్థులను కక్ష కట్టినట్టుగా అరెస్టు చేసి జైల్లోకి పంపడంలో కీలక భూమిక వహించిన అప్పటి సిఐడి చీఫ్ సంజయ్ ఇప్పుడు తాను కటకటాల వెనక్కి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
