పహల్గాంకు ప్రతీకారం: పాక్‌లో ఉగ్రస్థావరాలు నేలమట్టం!

Monday, December 8, 2025

26 మంది అమాయకుల ప్రాణాలను బలితీసుకున్న పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఈ ఉగ్రదాడికి పాల్పడిన దుండగులు భూమి మీద ఎక్కడ తలదాచుకున్నా సరే.. వారిని వేటాడి తీరుతాం.. మట్టుపెడతాం.. అని చాలా ఘాటుగా హెచ్చరించిన నరేంద్రమోడీ  చెప్పినట్టుగానే.. అసలు ఉగ్రవాద మూలాలను భారత దళాలు ధ్వంసం చేశాయి. బుధవారం తెల్లవారుజామున.. (మంగళవారం అర్ధరాత్రి దాటాక) 1.44 గంటలకు భారత దళాలు.. పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లలోని 9 ఉగ్రవాద స్థావరాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో మొత్తం 9 స్థానాల్లోని ఉగ్రస్థావరాలు సర్వనాశనం అయినట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ దాడుల్లో దాదాపు 80 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి.

పాకిస్తాన్ లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు.. ఇటీవల పహల్గాంలో పర్యాటకుల్ని విచక్షణారహితంగా మట్టుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. పర్యాటకుల మతం అడిగి మరీ.. హిందువులు అని కన్ఫర్మ్ చేసుకున్నాకే వారిని మట్టుపెట్టినట్టు ప్రత్యక్షంగా అక్కడ ఉండి చావు తప్పించుకున్న వ్యక్తులు చెప్పడం సంచలనం సృష్టించింది. ఈ ఉగ్రదాడులను కేంద్రప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఉగ్రవాదుల్ని మట్టుపెడతాం అని నరేంద్రమోడీ హెచ్చరించారు. ఆరోజునుంచి ఇప్పటిదాకా ప్రతిరోజూ.. ఉగ్రవాదుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో త్రివిధ దళాలతో కేంద్రంలోని పెద్దలు పలుదఫాలుగా సమావేశాలు నిర్వహిస్తూనే వచ్చారు.

ఈ విషయంలో ఎలాంటి సైనిక చర్యకు ఉపక్రమించాలనే విషయంలో సైన్యానికే పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టుగా మోడీ ప్రకటించారు కూడా. మరొకవైపు పాకిస్తాన్ తో యుద్ధం రావొచ్చుననే ఊహాగానాలు కొన్నిరోజులుగా పెరుగుతూ వచ్చాయి. కేంద్రప్రభుత్వం కూడా యుద్ధం వస్తే పౌరసమాజం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాక్ డ్రిల్ నిర్వహించే ప్రయత్నాలు కూడా కేంద్రం ప్రారంభించింది. దేశమంతా ఈ డ్రిల్ జరుగుతోంది. సరిగ్గా.. డ్రిల్ జరగాల్సి ఉండగా.. కొన్ని గంటల ముందుగానే.. ఈ దాడులు జరిగాయి.
భారత్ త్రివిధ దళాల సమన్వయంతో ఈ దాడులు జరిగినట్టుగా సైన్యం ప్రకటించింది.

చాలా కచ్చితత్వంతో కూడిన ఆధునిక మిసైళ్లతో దాడులు చేశారు. వీటివల్ల.. కోఆర్డినేట్స్ తో ఎంచుకున్న లక్ష్యం తప్ప.. పక్కనే ఉండే భవనాలు కూడా దెబ్బతినవు అని సైన్యం ప్రకటించింది. కేవలం ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడిచేసిన భారత్.. జనావాసాల జోలికి పాక్ సైనిక స్థావరాల జోలికి వెళ్లనేలేదు. ఆ విషయంలో చాలా సంయమనం పాటించింది. ఉగ్రదాడికి ప్రతీకారంగా.. ఉగ్రవాద స్థావరాల మీద జరిగిన దాడి మాత్రమే కావడంతో.. భారత్ కు ఈ హక్కు ఉన్నదని అంతర్జాతీయ సమాజం ఆమోదిస్తున్నదే తప్ప.. ఇరుదేశాల మధ్య యుద్ధవాతావరణాన్ని రెచ్చగొట్టే చర్యగా ఎవ్వరూ చూడడం లేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles