వైఎస్ విజయమ్మ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓ బహిరంగ సభలో పాల్గొన్న విజయమ్మ.. ఆమెకు ఏ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయో ఏమో.. పదేపదే కన్నీళ్లు పెట్టుకోవడం సభికులను కూడా కలచి వేసింది. ఇదంతా కూడా.. వైఎస్ షర్మిల తెలంగాణలో సాగిస్తున్న పాదయాత్ర 3500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగానే జరిగింది. ఆ సభలో పాల్గొన్న విజయమ్మ.. నా బిడ్డను దీవించి.. తెలంగాణకు తొలి మహిళా ముఖ్యమంత్రిని చేయండి అని అభ్యర్థిస్తూ పలుమార్లు కన్నీళ్లు పెట్టుకోవడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఆమె ఎందుకలా కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చిందనేది చర్చ!
వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన జీవించి ఉంటే అసలు రాష్ట్ర విభజన జరిగేదే కాదనే వాదనను ఇప్పటికీ కొందరు నమ్ముతారు. అయితే ఆయన మరణం తర్వాత.. ఆయన కుటుంబానికి రాజకీయ అందలాలు కట్టబెట్టడడానికి కొంత వేచిఉండాలని సోనియా అనడం, ‘సీఎం కావడానికి ఆలస్యమున్ సైతునా..’ అని పట్టుబట్టి.. కాంగ్రెసునుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి సొంతంగా వైసీపీని పెట్టుకోవడం జరిగింది.
వైఎస్సార్ మరణం తర్వాత.. అవినీతి కేసులు విచారణకు వచ్చి జగన్మోహన్ రెడ్డి జైలుపాలైనా కూడా.. వైసీపీ పార్టీ సర్వనాశనం అయిపోకుండా.. మనుగడలో ఉన్నదంటే అది కేవలం షర్మిల రెక్కల కష్టం. ‘జగనన్న వదిలిన బాణాన్ని నేను’ అని చెప్పుకుంటూ ఆమె సుదీర్ఘమైన పాదయాత్రలు చేసి ఏపీ అంతటా తిరుగుతూ కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీని కాపాడారు. అయితే జగన్ జైలునుంచి వచ్చిన తర్వాత.. అన్నాళ్ల కష్టానికి ఆమెకు దక్కిన ఫలితం మాత్రం సున్నా.
రాజకీయంగా బహుశా ఒక ఎంపీ స్థానాన్ని షర్మిల ఆశించి ఉండవచ్చు. కానీ జగన్ అది కూడా ఇవ్వలేదు. షర్మిలతో అవసరం తీరిపోయాక రాజకీయంగా ఆమెను తన పార్టీ ఛాయలకు కూడా రానివ్వకుండా దూరం పెట్టారని, ఆమె రాజకీయంగా తనకు కూడా ఏదో ఒక హోదా కావాలని కోరుకుంటే పడనివ్వలేదనే ప్రచారం ఉంది. తల్లిని మాత్రం పార్టీకి గౌరవాధ్యక్షరాలిగా ఉంచారు. కూతురు అలిగి తెలంగాణలో కొత్త పార్టీ పెట్టుకుంది. అధికారంలోకి రావడానికి విడతలువిడతలుగా పాదయాత్ర చేస్తోంది. ఇప్పటికి 3500 కిమీలు పూర్తి చేసింది. చెల్లెలికి జగన్ న్యాయం చేయడంలేదని విజయమ్మ అలిగారో ఏమో గానీ.. ఆమె వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా కూడా చేసేశారు. జగన్ కు అవసరం ఉన్నప్పుడు తాను వెంట ఉన్నానని ఆరోజున అనడం ద్వారా.. జగన్ కు తనతో అవసరం తీరిపోయిందని ఆమె చెప్పకనే చెప్పారు. ఇక కూతురితో ఉంటానన్నారు. ఆమె కూతురి పార్టీని సమర్థిస్తున్నారు. ఆ క్రమంలో భాగంగా.. కూతురు పాదయాత్ర సభలో పాల్గొన్న విజయమ్మకు జగన్ ద్వారా తన కన్నకూతురికి జరిగిన అన్యాయాలన్నీ గుర్తొచ్చాయేమో ఏమో గానీ.. ఆ కార్యక్రమంలో పలుమార్లు కన్నీళ్లు పెట్టుకున్నారని పలువురు అంటున్నారు.