జగన్ సర్కారు ఏలుబడిలోకి వచ్చిన తొలినాటినుంచి.. అనేక రకాల వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంది. ప్రత్యేకించి పోలీసులు అధికార పార్టీకి కార్యకర్తల్లాగా, నాయకులకు తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు రాష్ట్రంలో ఏదో ఒక మూల నుంచి ప్రతిరోజూ వినిపిస్తూనే ఉంటాయి. చిన్నా పెద్దా సంఘటనలు ఏవైనా సరే.. తెలుగుదేశం వారినుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు కనీసం కేసు నమోదు చేయడానికి కూడా తాత్సారం చేసే పోలీసులు, వైసీపీ నుంచి ఫిర్యాదు రాగానే తక్షణం అరెస్టులు చేసేసి జైల్లో పెట్టేసి.. ప్రజల్లో ఒక బీభత్స భయావహ వాతావరణం సృష్టించడానికి తమ వంతు కృషి చేస్తున్నారనేది సర్వత్రా వినిపిస్తున్న మాట. దీనిని వారు మళ్లీ మళ్లీ నిరూపించుకుంటున్నారు.
అనంతపురం జిల్లాలో కూడా పోలీసుల ఇలాంటి దూకుడు వ్యవహారం తాజాగా చర్చనీయాంశం అవుతోంది. తాడిపత్రి మునిసిపాలిటీ పరిధిలో.. విరాళంగా వచ్చిన చెత్త వాహనాలకు మరమ్మతులు చేయించకుండా, తమ దందా కొనసాగించడం కోసం అద్దె వాహనాలను వాడుకుంటున్నారంటూ.. ప్రభుత్వం మరమ్మతులకు కూడా నిధులివ్వడం లేదని సాక్షాత్తూ మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర రెడ్డి నిరసన చేపట్టారు. దీనికి సంబంధించి.. వైసీపీ, టీడీపీ నాయకులు పరస్పరం సామాజిక మాధ్యమాల్లో విమర్శలు రువ్వుకున్నారు. సోషల్ మీడియా అంటేనే ‘అతి’లాగా మారిపోతున్న నేపథ్యంలో.. ఈ పరస్పర విమర్శలు కూడా అదుపు తప్పాయి.
అయితే వైసీపీ నాయకుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కార్యరంగంలోకి దిగిపోయారు. టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కమలమ్మను అరెస్టు చేశారు. నోటీసులు గట్రా ఏమీ పట్టించుకోలేదు. వైసీపీ నుంచి ఫిర్యాదు రాగానే అరెస్టు తమ ప్రథమ కర్తవ్యం అన్నట్టుగా చెలరేగిపోయారు. కోర్టులో ప్రవేశపెట్టి రిమాండుకు కూడా డిమాండు చేశారు. అయితే ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థ హద్దులు లేకుండా చెలరేగిపోతున్నప్పుడు మరో వ్యవస్థ కాపుకాయడానికే ఉన్నదని మరోసారి నిరూపణ అయింది. టీడీపీ నాయకురాలు కమలమ్మను రిమాండుకు పంపడానికి కోర్టు తిరస్కరించింది. ఆమెకు 41 ఏ నోటీసులు ఇచ్చి పంపితే చాలునని పోలీసులకు సూచించింది.
తాడిపత్రిలో కమలమ్మ అరెస్టు అనేది కేవలం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. పోలీసులు ప్రతి చోటా ఇదే తీరుగా టీడీపీ వారి ఫిర్యాదులను నామమాత్రంగా కూడా పట్టించుకోకుండా, వైసీపీ వారు ఏం చెప్పినా సరే.. అరెస్టులకు ఎగబడుతూ జనం దృష్టిలో పలుచన అవుతున్నారు. జనానికి పోలీసులన్నా.. ప్రతిదానికీ వారిని ఉసిగొల్పుతూ కక్షసాధింపులకు పాల్పడుతున్న వైసీపీ నాయకులన్నా ఏహ్యభావం ఏర్పడుతోందంటే అతిశయోక్తి కాదు. పైస్థాయిలో నేతలు ఒక రేంజిలో ప్రత్యర్థుల్ని వేధిస్తోంటే.. కిందిస్థాయిలో గ్రామాల్లో కూడా చిన్న నాయకులు మరో రేంజిలో వేధిస్తున్నారని పోలీసులద్వారా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఉస్కో అంటే చాలు అరెస్టుకు రెడీ అయిపోతారు
Wednesday, January 1, 2025