స్టోన్ క్రషర్స్ యజమానులను బెదిరించి రెండు కోట్ల రూపాయలు ముడుపులు స్వీకరించారనే ఏసీబీ కేసులో మాజీ మంత్రి విడదల రజని.. ప్రభుత్వానికి సవాళ్లు విసిరారు. నరసరావు పేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు తన మీద అక్రమ కేసులు పెట్టించారని ఆరోపిస్తూ.. ఇందుకు వారు కూడా తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు కూడా. ఆ స్టోన్ క్రషర్స్ యజమానులెవరో తనకు తెలియదని, వారిని చూడనే లేదని కూడా సెలవిచ్చారు. బీసీమహిళ మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారని.. కులం కార్డును కూడా ప్రయోగించారు. అయితే తనమీద చేసిన ఆరోపణలపై కృష్ణదేవరాయలు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మరో కొత్త విషయాన్ని కూడా బయటపెట్టారు.
తాను ఏ స్టోన్ క్రషర్స్ యజమానులనైతే బెదిరించారో.. వారు లొంగకపోయే సరికి వారి మీద చర్యలు తీసుకోవడానికి అందులో చాలా అక్రమాలు జరుగుతున్నాయని విజిలెన్స్ శాఖ చర్యలు తీసుకోవాలని, జరిమానాలు విధించాలని కోరుతూ.. ఆమె ఎస్పీ పల్లె జాషువాకు స్వయంగా కంప్లయింటు చేశారు. ఈ సంగతిని ఎంపీ కృష్ణదేవరాయలు తేదీలతో సహా బయటపెట్టారు. విడదల రజని చేసిన కంప్లయింటు మీద ఎస్పీ జాషువా వెంటనే స్పందించలేదనే ఉద్దేశంతో.. ఆమె తన పార్టీలోని పలువురు ఇతర నాయకులను ఆశ్రయించి.. వారి ద్వారా ఎస్పీకి ఫోను చేయించి.. ఒత్తిడి పెంచి క్రషర్స్ యజమానుల మీద చర్యలు తీసుకునేలా చెప్పించారని కృష్ణ దేవరాయలు అంటున్నారు.
ఇదే విషయంలో ఎస్పీ జాషువా మీద ఒత్తిడి తీసుకురావడానికి మాధవరెడ్డి అనే సాక్షి మీడియా విలేకరిని వెంటబెట్టుకుని మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి వద్దకు వెళ్లలేదా? అంటూ లావు ప్రశ్నిస్తున్నారు. విడదల రజని దందాల కేసుల్లో ఇదొక కొత్త కోణం అని చెప్పాలి. అప్పటికి బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉన్నారు. విడదల రజని ఈ వ్యవహారం జరిగినప్పటికి సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. ఒక ఎమ్మెల్యే స్వయంగా ఫిర్యాదు చేస్తే.. మీరు చర్యలు తీసుకోరా.. అని బాలినేని ద్వారా.. ఎస్పీ జాషువా మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినట్టుగా లావు వెల్లడించారు.
ఇప్పుడు విడదల రజని నిజం చెబుతున్నారా? లేదా అబద్ధాలాడుతున్నారా? అనేది తేలవలసి ఉంది. స్టోన్ క్రషర్స్ పై ఆమె విజిలెన్స్ వారికి ఫిర్యాదు చేసి ఉంటే అది రికార్డుల్లో ఉంటుంది గనుక.. ఆమె తప్పించుకోలేరు. అడ్డంగా బుక్ అయిపోతారు. పైగా.. ఐపీఎస్ అధికారి పల్లె జాషువాకు 2040 వరకు సర్వీసు ఉన్నదని ఆయన స్వయంగా రాసి ఇచ్చన స్టేట్మెంట్ లోనే రజని ఫిర్యాదుల గురించి చెప్పారని.. ఎంపీ కృష్ణదేవరాయలు ఆ డాక్యుమెంట్ ప్రతిని చూపుతున్నారు. అలాగే ఇప్పుడు బాలినేని నోరు తెరిస్తే.. రజని నిజాలే చెబుతున్నారా కాదా తేలుతుంది. ఆయన ప్రస్తుతం జనసేనలో ఉన్నారు. ఆయన కూడా నోరు తెరిచి అసలు వాస్తవాలను వెల్లడించాలని ప్రజలు కోరుకుంటున్నారు.