తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి కల్తీ అనే వ్యవహారం ఇప్పుడు రాష్ట్రాన్ని మాత్రమే కాదు.. దేశాన్ని కూడా కుదిపేస్తున్న సమస్య. ఈ విషయంలో కేంద్రప్రభుత్వం కూడా శ్రద్ధ చూపిస్తోంది. దేశవ్యాప్తంగా హిందూ ధర్మానికి చెందిన ఆధ్యాత్మికవేత్తలు జోక్యం చేసుకుంటున్నారు. స్పందిస్తున్నారు. భక్తుల విశ్వాసాలకు ద్రోహం జరుగుతున్నదని మాట్లాడుతున్నారు. అయితే.. మధ్యలో, పానకంలో పుడకలాగా ఎంట్రీ ఇచ్చి సినీనటుడు ప్రకాశ్ రాజ్ తన పరువు తానే తీసుకున్నారనే చర్చ ఇప్పుడు నడుస్తోంది.
ప్రకాశ్ రాజ్ కు ఈ తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారానికి ఎలాంటి సంబంధం లేదు. అయినాసరే ఆయన తగుదునమ్మా అంటూ ఇందులో వేలు పెట్టారు. ‘మీరు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన సంఘటన ఇది. విచారించి నేరస్తులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలు కల్పించి దీన్ని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు. మనదేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు చాలు’ అంటూ ప్రకాశ్ రాజ్ పోస్టు పెట్టారు.
అంటే పవన్ కల్యాణ్ ఏదో గల్ల దేవుడి వ్యవహారాన్ని జాతీయ స్థాయికి పెంచుతున్నట్టుగా ఆయన పోస్టు ధ్వనిస్తోంది. తిరుమలేశుడి ప్రసాదం అంటేనే కేవలం యావత్ దేశానికి మాత్రమే కాదు. యావత్ ప్రపంచానికి సంబంధించిన సమస్య. అయితే పందికొవ్వు, గొడ్డు కొవ్వు కలపడం వెనుక మతపరమైన మూలాలు ఉన్నాయో లేదో మాత్రం తెలియదు. అయినా .. దీనిని జాతీయ స్థాయికి తీసుకెళ్లకుండా కప్పెట్టేయాలని ప్రకాశ్ రాజ్ కోరుకుంటున్నారేమో తెలియదు. కానీ బిజెపి వ్యతిరేకతతో సదా వేగిపోతూ ఉండే ప్రకాశ్ రాజ్ ఆ ట్వీట్ తో పరువు పోగొట్టుకున్నారు.
మా ఎన్నికల్లో పవన్ మద్దతును కూడా తానే బతిమాలి కూడగట్టుకుని కూడా ఓడిపోయిన ప్రకాశ్ రాజ్.. ఇప్పుడు ఆయన మీదనే విమర్శలకు దిగుతున్నారని పలువురు అంటున్నారు. చివరికి మా ఎన్నికల్లో ఆయన్ను ఓడించిన మంచు విష్ణు కూడా ఇప్పుడు పవన్ ను సమర్థిస్తూ.. ప్రకాశ్ రాజ్ వైఖరిని తప్పుపట్టడం గమనించాల్సిన సంగతి.