పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేయడానికి, ప్రజలతో మమేకం కావడానికి ‘వారాహి’ పేరుతో వాహనాన్ని సిద్ధం చేసుకుంటే.. దానిని చూసి నీరుగారిపోయిన వైఎస్ఆర్సిపి దళాలు అసలు విషయం అంతా వదిలేసి వాహనం రంగు గురించి విమర్శలు చేస్తుండడం అందరికీ తెలిసిందే. వాహనానికి వేసిన మిలిటరీ గ్రీన్ రంగు నిబంధనలకు విరుద్ధం అని.. ఈ వాహనానికి అనుమతులు రావు అని వైఎస్ఆర్సిపి నాయకులు మంత్రులు తమ వంతుగా చెలరేగిపోతున్నారు.
వాహనం తయారీ దగ్గర నుంచి రంగుల వరకు ప్రతి విషయంలోనూ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే రూపొందించామని.. కాబట్టే అనుమతులు వచ్చాయని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించినప్పటికీ వైసీపీ దళాల రంగు పులిమే వ్యాఖ్యలు ఇంకా ఆగలేదు. ‘పవన్ రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేస్తున్నారు’ అంటేనే జడుసుకుంటున్న ఆ పార్టీ నాయకులు వాహనం దగ్గర నుంచే ఏదో ఒక వెకిలి, లేకి విమర్శలు చేయడం ద్వారా పార్టీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయగల అనుకుంటున్నారు. అయితే వాహనం రంగు విషయంలో మాట్లాడుతున్న వైసీపీ దళాలకు జనసేన ని పవన్ కళ్యాణ్ ఓ ఘాటైన కౌంటర్ ఇచ్చారు. తన ట్విట్టర్ పోస్ట్ ద్వారా దిమ్మతిరిగే పంచ్ ఇచ్చారు.
తన ట్విట్టర్ అకౌంట్ లో ఒక మిలిటరీ గ్రీన్ షర్టు బొమ్మను పోస్ట్ చేసిన పవన్ కళ్యాణ్ ‘‘వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులరా.. కనీసం నేను ఈ చొక్కాను ధరించవచ్చా అనుమతి ఇవ్వండి’’ అని అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టారు. వైఎస్ఆర్సిపి నాయకులు దుర్మార్గమైన రంగుల ప్రచారానికి ఇది చాలా చాలా సెటైరికల్ స్ట్రాంగ్ కౌంటర్.
పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా చేయదలచుకున్న యాత్ర, నిజానికి రెండు నెలల కిందటే మొదలు కావలసి ఉంది. అనివార్య కారణాల వలన ఆయన దానిని కాస్త వాయిదా వేసుకున్నారు. ఒకసారి యాత్ర ప్రారంభించిన తర్వాత ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగించడానికి సరైన రీతిలో ఆధునిక హంగులతో ఒక వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో కరెంటు పవర్ కట్ చేస్తూ వైసిపి ప్రభుత్వం కొన్ని దుర్మార్గాలకు పాల్పడుతున్న నేపథ్యంలో.. కరెంటు ఇబ్బందులు కూడా లేకుండా ఈ వాహనానికి రూపకల్పన జరగడం విశేషం. అదే వాహనాన్ని సభా వేదికగా కూడా వాడుకునేలా ఆయన తీర్చిదిద్దుకున్నారు. ఆ వాహనానికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. దానిని చూసి వైసిపి ఓర్వలేక పోతున్నది. వేరే చేసేదేమీ లేక వాహనం రంగు నిబంధనలకు విరుద్ధం అంటూ లేకి నిందలు వేస్తున్నారు. అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే మాదిరిగా వారాహి వాహనారూఢుడై పవన్ కళ్యాణ్ ఎన్నికల సమరసీమలో శంఖారావం చేస్తారని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు.