తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మాత్రమే కాదు, రాజకీయ యవనిక మీద కూడా తాను తిరుగులేని పవర్ స్టార్ అని నిరూపించుకున్నారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేసిన అన్ని నియోజకవర్గాలలోను ఘనవిజయం సాధించింది. జనసేన 21 అసెంబ్లీ స్థానాలలో, రెండు ఎంపీ స్థానాలలో ఈసారి పోటీ చేసింది. ఎన్డీఏ జట్టులో భాగంగా ఉండడం వలన పరిమితంగా మాత్రమే ఈ స్థానాలలో పోటీ చేసిన జనసేన.. మొత్తం అన్ని స్థానాలలోనూ ఘన విజయం సాధించింది. భారతదేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డు. ఒక ప్రాంతీయ పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాలలోనూ విజయం సాధించడం అనేది దేశ చరిత్రలో ఎక్కడా ఎప్పుడూ జరగనే లేదు. భవిష్యత్తులో కూడా ఇలాంటి రికార్డును మరొకరు అధిగమిస్తారనే నమ్మకం లేదు. ఈ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ సూపర్ హీరో అనిపించుకున్నారు.
పొత్తులలో భాగంగా తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన కనీసం 60 సీట్లు తీసుకోవాలంటూ జనసేన పార్టీ నాయకులు చాలామంది కోరుకున్నారు. పవన్ కళ్యాణ్ కు బయటినుంచి సలహాలు చెప్పే అనేకమంది మేధావులు కూడా.. పెద్ద సంఖ్యలో సీట్లు తీసుకోకుండా తెలుగుదేశంతో పొత్తుకు ఒప్పుకోకూడదని పదేపదే చెప్పారు. జనసేన కూడా తొలుత ఎక్కువ స్థానాలే ఆశించినప్పటికీ.. నెమ్మది నెమ్మదిగా పరిస్థితులను అర్థం చేసుకుంటూ.. పొత్తుల్లో భాగంగా 30 సీట్లు తీసుకోవడానికి అంగీకరించింది.
కానీ అదే జట్టులోకి భారతీయ జనతా పార్టీ కూడా వచ్చి చేరిన తర్వాత.. వారికి అదనంగా సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ససేమిరా అన్నారు. 30 సీట్లలోనే బిజెపి -జనసేన ఇద్దరు పంచుకోవాలని చంద్రబాబు కండిషన్ పెట్టారు. అనివార్యమైన పరిస్థితులలో.. ఒకవైపు భారతీయ జనతా పార్టీ తమకు కనీసం 10 సీట్లు కావాల్సిందే అని గట్టిగా పట్టుబడుతుండగా.. పవన్ కళ్యాణ్ 20 సీట్లు తీసుకోవడానికి ఒప్పుకున్నారు. ఆ తర్వాత స్థానిక సమీకరణాలను దృష్ట్యా అదికాస్తా 21 సీట్లకు వెళ్ళింది. 175 స్థానాలు ఉన్న అసెంబ్లీలో పొత్రుల్లో భాగంగా జనసేన కేవలం 21 సీట్లకు పరిమితం కావడాన్ని అతని వైఫల్యంగా చూపుతూ పవన్ ను రెచ్చగొట్టడానికి చాలా శక్తులు పనిచేశాయి. ఈ కారణం మీదనే పవన్ రెచ్చిపోయేలా చేయడానికి, కూటమిలో అసంతృప్తులు రాజేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తమ శక్తి వంచన లేకుండా ప్రయత్నించింది.
అయితే వారి పాచికలు ఏమీ పారలేదు. పవన్ కళ్యాణ్ రెచ్చిపోలేదు. చాలా చాలా సంయమనం పాటించారు. తమ పార్టీకి దక్కిన అన్ని సీట్ల మీద శ్రద్ధగా ఫోకస్ పెట్టారు. అలాగని కూటమి ధర్మాన్ని విస్మరించకుండా బిజెపి తెలుగుదేశం పోటీ చేస్తున్న అనేక ఇతర ప్రాంతాలలో కూడా ప్రచార సభలు నిర్వహించారు. ఆయా నియోజకవర్గాలలో జనసేన శ్రేణులు అసంతృప్తికి గురికాకుండా వారందరినీ ఒప్పించి ఓటు బదిలీ సక్రమంగా జరిగేలా ఏర్పాటు చేశారు. దాని ఫలితం ఏమిటో ఇప్పుడు అందరూ చూస్తూనే ఉన్నాం. జనసేన పార్టీ టోటల్గా 21 అసెంబ్లీ స్థానాలలో.. రెండు ఎంపీ స్థానాలలో ఘనవిజయం సాధిస్తుంది. అందుకే పవన్ కు సాటి రాగల నాయకుడు ఈ దేశంలో మరొకరు ఉన్నారా అని ప్రజలందరూ కొనియాడుతున్నారు.
పవన్ కు సాటి.. ఈ దేశంలో మరొకరు ఉన్నారా??
Monday, December 23, 2024