మరికొన్ని గంటల వ్యవధిలో ప్రజల తీర్పు- ఎవరిని సింహాసనం మీద కూర్చోబెట్టబోతుందో.. ఎవరిని పరాజితులుగా తిప్పి కొడుతుందో తేలిపోనున్నది. అయితే ఇప్పటికీ తలా తోకా లేని విశ్లేషణలతో ప్రజల ఆలోచనలను గందరగోళం చేయడానికి వైయస్సార్ కాంగ్రెస్ దళాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికలలో దారుణంగా ఓడిపోబోతున్నారంటూ సాక్షి గ్రూపు మీడియా సంస్థలు విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. అయితే ఎందుకు ఓడిపోతున్నారు అనే విషయంలో.. వారి ఛానల్ ప్రచారం చేస్తున్న ప్రధాన కారణాన్ని విశ్లేషిస్తే గనుక అసలు ఓడిపోతున్నది జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
సాక్షి టీవీ ఛానల్ విశ్లేషణలో ఎలాంటి ప్రచారం చేస్తున్నారంటే.. చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికలలో కేవలం నెగటివ్ ప్రచారం మీద మాత్రమే ఆధారపడి వెళ్లారని.. నెగిటివ్ ప్రచారం ఎప్పుడూ కూడా పార్టీలను గెలిపించడం సాధ్యం కాదని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగాలేదు, దోచుకున్నారు, దుర్మార్గమైన ప్రభుత్వం, భూకబ్జాలు చేశారు ఇలాంటి ఆరోపణలే తప్ప.. తాము ప్రజలకు ఏం చేస్తామో చెప్పనేలేదని సాక్షి టీవీ చర్చల్లో ఊదరగొడుతున్నారు. వారు చెబుతున్న మాట నిజమే! కేవలం నెగిటివ్ ప్రచారం మీద ఆధారపడితే ఏ పార్టీ అయినా గెలవడం సాధ్యం కాదు! అయితే వాస్తవంగా పరిశీలించినప్పుడు అసలు నెగటివ్ ప్రచారం మీద ఆధారపడింది ఎవరు? అనే ప్రశ్న ప్రజలలో తలెత్తుతోంది.
చంద్రబాబు నాయుడు కేవలం నెగటివ్ ప్రచారం మీద ఆధారపడ్డారని కేవలం అవివేకంతో కూడిన ఆరోపణ. ఎందుకంటే ఏడాది కిందట ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలతోనే ఈ రాష్ట్ర ప్రజలకు తాను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఏం చేయబోతున్నానో చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా సంకేతాలు పంపారు. ప్రజాభిప్రాయాన్ని కాంక్షించే సూపర్ సిక్స్ హామీలు విస్తృతంగా ఏడాది రోజులపాటు ప్రజల్లోకి వెళ్లాయి. వృద్ధుల పెన్షన్లను నాలుగువేలకు పెంచడం, వికలాంగుల పెన్షన్లను ఆరువేలకు పెంచడం.. వంటి అనేక విషయాలను కొత్తగా చంద్రబాబు నాయుడు ప్రజలకు హామీ ఇచ్చారు. వాటితోపాటు నిర్మాణాత్మక అభివృద్ధి విషయంలో ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారో.. ఆ దిశగా అడుగులు వేసే ప్రమాణం కూడా చేశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కట్టుబడి ఉంటానని చంద్రబాబు అన్నారు. నిజానికి జగన్ అవినీతి అనేది చంద్రబాబు ప్రచార ఆస్త్రాలలో చాలా చిన్న విషయం. వారు సాగించినదంతా పాజిటివ్ ప్రచారమే. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని మాత్రం.. ప్రజలకు తాను కొత్తగా ఏం చేస్తానో ఒక్క పద్ధతైన హామీ కూడా ఇవ్వలేకపోయారు. ‘చంద్రబాబు నాయుడు హామీలను ప్రజలు నమ్మరు’ అనడం తప్ప ఆయన వద్ద మరొక మాట లేకుండా పోయింది. నేను మంచి చేశాను నన్ను గెలిపించండి ఇదే కొనసాగిస్తాను అనడం తప్ప కొత్తగా ఏమైనా చేస్తాను అని ఆయన చెప్పలేదు. చంద్రబాబును తిట్టడానికి తప్ప మరొక అంశంపై దృష్టి కేంద్రీకరించలేదు. అసలైన నెగటివ్ ప్రచారం అంటే జగన్ చేసినది మాత్రమే! కాబట్టి నెగటివ్ ప్రచారాన్ని ప్రజలు అసహ్యించుకుని ఆ పార్టీని ఓడిస్తారు అనే సిద్ధాంతం నిజమే అనుకుంటే కనుక.. తప్పనిసరిగా ఓడిపోయేది జగన్ మాత్రమే అని ప్రజలు అనుకుంటున్నారు.
పాజిటివ్ ప్రచారమే చంద్రబాబుకు లాభిస్తోందా??
Sunday, December 22, 2024