ఇంట్లో భార్య గొడవ చేసినప్పుడు.. ‘అబ్బెబ్బే ఇక జీవితంలో మందు ముట్టనే ముట్టను.. నీ మీదొట్టు’ అని చెప్పే తాగుబోతు భర్తలు ప్రపంచంలో ఎంతమంది ఉంటారు? వారిలో కనీసం ఒక్కరైనా ఆ మాట మీద జీవితాంతం నిలబడిన దాఖలాలు ఈ ప్రపంచంలో మనకు కనిపిస్తాయా? ఎగ్జాక్ట్‌గా అదే మాదిరిగా ఉన్నది ఇప్పుడు పోసాని కృష్ణమురళి వ్యవహారం కూడా. జన్మలో ఇక రాజకీయాల గురించి మాట్లాడను.. అని ఈ కమెడియన్ నటుడు భీషణమైన ప్రతిజ్ఞ చేస్తున్నారు. మాట్లాడిన మాటలు తల బొప్పి కట్టే రోజులు దాపురించడంతో.. ఆయన వైరాగ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ వైరాగ్యం కూడా ఒక బూటకం అని.. మాట నిలబెట్టుకునే వ్యవహారం కాదని ప్రజలు మాత్రం నవ్వుకుంటున్నారు.
అత్యంత నాటకీయంగా మాట్లాడడం, అత్యంత అసభ్యమైన భాషలోనే ప్రెస్ మీట్ లలో కూడా విమర్శలు చేయడం అనేది పోసాని కృష్ణమురళి ప్రత్యేకత. సాధారంగా అసభ్య భాషలో విమర్శించేవారు.. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే పులులులాగా చెలామణీ అవుతుంటారు. పోసాని అలాకాదు. ఆయన ప్రెస్ మీట్ లో కూడా అసభ్యమైన భాష వాడగలరు. అందుకే బహుశా ఆయన జగన్మోహన రెడ్డికి ప్రీతి పాత్రమైన నాయకుడు కాలిగారు. జగన్ ద్వేషించే పవన్ కల్యాణ్ ను ఎడాపెడా బూతులు తిట్టిన పోసాని కృష్ణమురళికి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవిని కట్టబెట్టారు.
ఆ పదవిలో ఉండగా కూడా ఆయన అనేక రీతులుగా జగన్మోహన్ రెడ్డికి రుణం తీర్చుకున్నారు. శాశ్వతంగా ఏపీకి తానే ముఖ్యమంత్రిగా ఉంటానని జగన్ కలగన్నట్టుగానే.. ఆయన అనుచరులు కూడా అనుకున్నారు. అందుకే ఎవరికి వారు రెచ్చిపోయారు. తీరా ఇప్పుడు అప్పుడు తిట్టిన తిట్లన్నీ పోలీసుకేసుల రూపంలో పలకరిస్తుండే సరికి పోసాని కృష్ణమురళి వంటి వారు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
ఒక రకంగా చూస్తే పోసాని కృష్ణమురళికంటె.. చెన్నైలో ఉండే నటి శ్రీరెడ్డి కాస్త బెటర్. నేను చచ్చేవరకు జగననన వెంటే ఉంటాను గానీ.. ఇప్పటిదాకా పెట్టిన పోస్టులకు సారీ, క్షమించండి.. అని మాత్రమే ఆమె అన్నారు. పోసాని అలా కాదు. జగన్ ను కూడా గాలికి వదిలేశారు. ఇక జీవితంలో రాజకీయాల జోలికెళ్లను అంటున్నారు. ఈ వైరాగ్యం వలన తన మీద కేసులు కొట్టేయరు కదా అని అంటున్నారు గానీ.. విచారణలో ఈ సాకు చూపి పోలీసుల్ని బతిమాలుకుంటారనేది అందరికీ తెలిసిన సంగతే. అలాగే.. మళ్లీ జగన్ సీఎం కావడం అంటూ జరిగితే.. మళ్లీ తెరముందుకు వచ్చి రెచ్చిపోయి మాట్లాడడం జరుగుతుందని కూడా ప్రజలు అనుకుంటున్నారు.