లోకేష్ పాదయాత్ర : ఈలోగా కేసులు, అరెస్టు!

Wednesday, November 13, 2024

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై ఎలాంటి నేరపూరితమైన అభియోగాలు మోపవచ్చునో, ఆయనను ఇరికించడానికి ఎలాంటి కేసులు నమోదు చేయవచ్చునో ఉండగల అవకాశాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్వేషిస్తోంది. ఈ మేరకు పార్టీ కీలక నాయకులు, మంత్రాంగ నిపుణులు పనిలో పడ్డారు. వీలైనంత త్వరలో నారా లోకేష్ ను అరెస్టు చేసి జైలుకు పంపడం లక్ష్యంగా ఆయన మీద ఎలాంటి కేసులు పెట్టడానికి అవకాశం ఉన్నదో పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు జనవరి 27వ తేదీన పాదయాత్ర ప్రారంభించడానికి ముందే ఆయన అరెస్టు మరియు జైలుకు పంపే కార్యక్రమం పూర్తి కావాలనేది వైసిపి పెద్దల టార్గెట్ అని తెలుస్తోంది!

నారా లోకేష్ మంత్రిగా పనిచేసిన రోజుల్లో జరిగిన వ్యవహారాలు, లావాదేవీలు అన్నింటినీ ఇప్పుడు తిరగతోడుతున్నారు. ఇప్పటికే రకరకాల అవినీతి కేసుల్లో నారా లోకేష్ సన్నిహితులైన వారిని ఇరికించి వేధించడం జరుగుతూనే ఉంది. ఏకంగా లోకేష్ ని బుక్ చేయడానికి వారికి అవకాశం చిక్కడం లేదు. అయితే ఇప్పుడు సమయం ఆసన్నం అయిందని, పాదయాత్ర ప్రారంభించే ముందుగానే అరెస్టు మరియు జైలుకు వెళ్లేలా కేసులు పెట్టాలని లక్ష్యంతో వెతుకుతున్నారు.

నారా లోకేష్ మంత్రిగా పనిచేస్తున్న రోజుల్లో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారని, అవినీతికి పాల్పడ్డారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు పదేపదే ఆరోపిస్తూ ఉంటారు. అయితే ఈ మూడున్నర ఏళ్లలో అందుకు సంబంధించి నిర్దిష్టమైన ఆధారాలేమీ లేవు. లోకేష్ అవినీతి చేసినట్టుగా సాక్ష్యాలతో పేర్కొనడం జరగలేదు. బెయిల్ రాగల కేసులు అయినా పర్వాలేదు కానీ అరెస్టు మాత్రం జరగాల్సిందే అనే ఉద్దేశంతో వెతుకుతున్నట్టుగా తెలుస్తోంది.

నారా లోకేష్ జనవరి 27వ తేదీ నుంచి ప్రారంభించదలచుకున్న రాష్ట్రవ్యాప్త పాదయాత్ర రెండు నెలల ముందు నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేయడానికి నారా లోకేష్ సిద్ధపడ్డారు. ఏడాది పాటు పూర్తిగా ప్రజల్లోనే ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. అయితే ఆయన పాదయాత్రను నైతికంగా దెబ్బ కొట్టడానికి, చికాకులు సృష్టించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. పాదయాత్ర సాగుతుండగా ఇబ్బందులు కలిగిస్తే లోకేష్ క్రేజ్ మరింత పెరుగుతుందనే ఉద్దేశంతో ఉన్నారు. అలా కాకుండా యాత్ర ప్రారంభం కావడానికి ముందే రకరకాల కేసులు బనాయించి అరెస్టు చేసేస్తే, అదంతా ఆయన చేసిన అవినీతి ఫలితం అని బుకాయించడానికి వీలవుతుందని వారు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.. ఈ కుట్ర రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles