పీఆర్సీ వ్యవహారంలో రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వం కడుపుమంటకు గురిచేసింది. ఎన్నో పోరాటాలు చేసి కూడా వారు సాధించుకున్నది మాత్రం సున్నా. ఆ సమయంలో ప్రభుత్వంతో ఉద్యోగులు ఏ స్థాయిలో గొడవ పెట్టుకున్నారో అందరికీ తెలుసు. ఉద్యోగ నాయకుల్లో కొందరు లోబడిపోయారా? లేదా, వేరే గత్యంతరం లేదు.. ప్రభుత్వం మరీ మొండిగా వ్యవహరిస్తోందని ఉద్యోగులే రాజీపడ్డారా? ఏదైతేనేం.. మొత్తానికి ఆందోళనలు తగ్గాయి. అయితే ఉద్యోగుల కడుపుమంట మాత్రం తగ్గలేదు. వారిని అప్పటికి ఉపశమింపజేయడానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలేమీ నెరవేరలేదు. సీపీఎస్ విషయంలోనూ మొండిచెయ్యే చూపించింది. ఇలా అన్ని రకాలుగానూ వారు ప్రభుత్వం తీరుపట్ల కోపోద్రిక్తులై ఉండగా తాజాగా మంత్రి మాటలు వారిని మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయి.
ఉద్యోగులు తమకు ప్రభుత్వం న్యాయం చేయడంలేదని ఉడికిపోతూ ఉంటే.. పుండుమీద కారం రాసినట్లుగా ప్రభుత్వం.. తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారుగా చంద్రశేఖర రెడ్డిని నియమించింది. ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకంటె సలహాదారులే ఎక్కువ అయిపోతున్నారనే చందంగా పరిస్థితి తయారవుతోంది. ప్రభుత్వంలోని పెద్దల ప్రాపకం, ఆశీస్సులు ఉంటే చాలు.. ప్రతి ఒక్కరూ సలహాదారు పోస్టు ఒకటి పుచ్చుకుని.. లక్షల్లో జీతాలు పొందుతూ, వాహనం సహా వైభోగాలను అనుభవిస్తూ గడిపేయవచ్చు. ఉద్యోగులు మండిపడుతూ ఉన్న సమయంలో వారి సంక్షేమం గురించి సలహాలు ఇవ్వడానికి ఒక సలహాదారు పోస్లు అనేదే పెద్ద కామెడీ.
అయితే ఈ సలహాదారు పదవీ స్వీకార ప్రమాణం సందర్భంగా.. మంత్రి బొత్స సత్యానారాయణ ఉద్యోగులను మరింతగా చులకన చేసే మాటలు మాట్లాడారు. ప్రభుత్వానికి ఉద్యోగుల కంటె రాష్ట్రంలోని కోట్లాది మంది ప్రజల సంక్షేమమే ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్యోగుల సమస్యలు ఎప్పుడూ ఉంటాయని, వారికి తీరే కోరికలు ఉంటే మంచిదని ఎద్దేవా చేశారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ఓ సలహాదారు పోస్టు తయారుచేసి, ఆ కార్యక్రమంలో.. ఉద్యోగులను ఎగతాళి చేస్తూ మాట్లాడడం అనేది ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది.
ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉన్న ఉద్యోగులు మంత్రి బొత్స వ్యాఖ్యలతో మరింతగా రగిలిపోతున్నారు. వచ్చే ఎన్నికల సమయానికి ఉద్యోగుల వర్గం మొత్తం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం కనిపిస్తోంది. మధ్యమధ్యలో ప్రభుత్వంలోని పెద్దలు కొందరు ఉద్యోగులను దువ్వడానికి అన్నట్లుగా కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. అయితే.. మంత్రి బొత్స లాంటి వాళ్లు తమ నోటి దురుసుతో ఉద్యోగుల్లోని కడుపుమంటను మరింతగా ఎగదోస్తూ వారి ఆగ్రహాన్ని పెంచుతున్నారనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.