ఏ ఉత్తరాంధ్రకు ద్రోహం చేయడానికే రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్నారంటూ.. అధికార పార్టీ నాయకులు రాజకీయ ప్రత్యర్థులపై నిందలు వేస్తుంటారో.. అదే ఉత్తరాంధ్రలో బలోపేతం కావడం ద్వారా.. వైసీపీ ప్రచారాలకు చెక్ పెట్టాలని జనసేనాని పవన్ కల్యాణ్ తలపోస్తున్నారు. అమరావతి రాజధానికి అనుకూలంగా జనసేన స్పష్టమైన విధానం అనుసరిస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో.. అధికార వికేంద్రీకరణ అనే మాటతో అభివృద్ధికి ముడిపెట్టి చేస్తున్న మాయను కూడా పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకే ఉత్తరాంధ్రలో జనసేన బలోపేతానికి పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్టుగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
విశాఖలో రాజధానిని పెట్టడం అంటే.. అదేదో కేవలం ఉత్తరాంధ్రకు మాత్రమే పరిమితమైన వ్యవహారంలాగా, ఉత్తరాంధ్రకు మాత్రమే మేలుచేసే వ్యవహారం లాగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంటుంది. అయితే నిజానికి విశాఖలో రాజధాని పేరిట.. విశాఖ నగరం, పరిసర ప్రాంతాలంతా బీభత్సంగా భూదందా చేయడం తప్ప.. వారికి మరో లక్ష్యం లేదనేది సర్వత్రా వినిపిస్తున్న సంగతి. విశాఖ భూలావాదేవీల్లో ఇటీవలి కాలంలో వెలుగుచూస్తున్న కుంభకోణాలు, మతలబులు, రభసలు అన్నీ కలిపి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం భూదోపిడీ కోసం మాత్రమే.. విశాఖను రాజధానిగా ప్రకటించిందనే అభిప్రాయం కలిగిస్తుంటాయి. దానికి తగ్గట్టుగానే.. రాజధాని వికేంద్రీకరణ మద్దతు సభలకు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పెద్దగా స్పందన లేదు. విశాఖ తప్ప ఎవ్వరూ పట్టించుకోలేదు. విశాఖ వాసులకు కూడా.. రాజధాని కావడం పట్ల విముఖత ఏర్పడుతోంది. అక్రమాలు, రౌడీయిజం పెరుగుతుందని ప్రశాంతమైన విశాఖ వాసులు భయపడుతున్నారు.
ఇన్ని కారణాలున్నాయి గనుకనే.. స్పష్టంగా వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్న పవన్ కల్యాణ్ అక్కడ పర్యటనకు వెళ్లినా.. విశాఖ వాసులు బ్రహ్మరథం పట్టారు. అధికార పార్టీ కంగారు పడేస్థాయిలో ఆయన పర్యటన సాగింది. ఆయన పర్యటన మీద పూర్తిగా ఆంక్షలు విధించి, బయటకు కదలనివ్వకుండా.. ప్రభుత్వం అతి జాగ్రత్తలు తీసుకుంది. అదంతా పవన్ ఇమేజీని మరింత పెంచిందే తప్ప తగ్గించలేదు.
ఇదే ఊపులో.. యావత్ ఉత్తరాంధ్రలో పార్టీ విధానాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి బలోపేతం చేయాలని జనసేనాని సంకల్పిస్తున్నారు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పార్టీ బలోపేతానికి నాదెండ్ల మనోహర్ ను పంపారు. అక్కడ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితిని సమీక్షించి ఎన్నికల సమరానికి సన్నద్ధం చేసే బాధ్యతను ఆయనచూస్తారు.ఉత్తరాంధ్రలో పవన్ కల్యాణ్ కు మంచి ప్రజాదరణ ఉంది. దానిని ఎన్నికల్లో విజయంగా మార్చే ప్రయత్నాలను జనసేనాని ఇప్పటినుంచే ప్రారంభిస్తున్నారు. విశాఖలో కూడా భూఅక్రమాలను ఎప్పటికప్పుడు తమ పార్టీ నాయకుల ద్వారా వెలికితెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. భూఅక్రమాలకు వ్యతిరేకంగా పోరాటాలూ సాగించాలని పిలుపు ఇస్తున్నారు. మొత్తానికి ఏ ఉత్తరాంధ్ర కు మేలు పేరిట.. జగన్ సర్కారు రాజధాని మాయ చేస్తున్నదో.. అదే ఉత్తరాంధ్రలో జెండా పాతాలని పవన్ కృతనిశ్చయంతో ఉండడం విశేషం.