తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య పొత్తు బంధం ఏర్పడింది. చంద్రబాబునాయుడుతో ములాఖత్ అయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. భేటీ అనంతరం బయటకు వచ్చి.. తమ పార్టీ తెలుగుదేశానికి మద్దతు ఇస్తుందని అధికారికంగా ప్రకటించారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం- జనసేన రెండు పార్టీలు కలిసి పోటీచేస్తాయని ఆయన వెల్లడించారు. ఎన్డీయే భాగస్వామిగా భారతీయ జనతా పార్టీతో బంధం కొనసాగుతుందా లేదా ఆయన క్లారిటీ ఇవ్వలేదు. మూడు పార్టీలు కలిసి పోటీచేసే అవకాశం ఉంటుందనే కొందరి ఊహాగానాలను తిప్పికొట్టలేదు. తమ రెండు పార్టీలు కలిసిపోటీ చేయబోతున్న సంగతి మాత్రం అఫీషియల్ గా వెల్లడించారు. భాజపా కూడా తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నట్టుగా ఆయన అన్నారు.
అదే సమయంలో భాజాపా సీనియర్ నాయకుల్లో ఒకరైన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ ఎన్నికల్లో బిజెపి సహా మూడు విపక్ష పార్టీలు కూడా కలిసి పోటీచేయబోతున్నట్టుగా వెల్లడించారు. అయితే ఆయన ప్రకటనను భారతీయ జనతా పార్టీ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఏపీ భాజపా అధికారికంగా.. మూడు పార్టీల పొత్తుల సంగతి తమ అధిష్ఠానం చూసుకుంటుందని.. జనసేనతో మాత్రం ప్రస్తుతం తమకు బంధం కొనసాగుతున్నదని అనడం గమనార్హం.
జనసేనతో కలిసి పోటీ చేసే అంశంపై వర్కవుట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ ఒక కమిటీని ఏర్పాటుచేయబోతోంది. ఈ విషయాన్ని నారా లోకేష్ స్వయంగా ప్రకటించారు. త్వరలోనే ఈ ఇరు పార్టీలకు చెందిన నాయకులు విజయవాడలో సమావేశమై మిగిలిన అన్ని విషయాల గురించి చర్చిస్తారని అనుకుంటున్నారు. చంద్రబాబునాయుడు అరాచకంగా అరెస్టు చేసి జైల్లో నిర్బంధించి వేధిస్తున్న తీరుమీద కూడా తక్షణమే ఈ రెండు పార్టీలు ఉమ్మడి కార్యచరణలోకి దిగేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
గురువారం నాటి ఈ ప్రకటన ద్వారా పవన్ కల్యాణ్.. బంతిని బిజెపి కోర్టులోకి నెట్టేసినట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు బిజెపి హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి. చంద్రబాబునాయుడు అరెస్టు మీద ఆచితూచి మాట్లాడుతున్న వారు.. పొత్తులపై ఇప్పుడే తేలుస్తారా లేదా అనేది కూడా సందేహమే. తెలుగుదేశం- జనసేన రెండు పార్టీలు కలిసిపోవడం మాత్రం.. వైసీపీ శ్రేణుల్లో గుబులు పుట్టిస్తోంది.