చాలా సందర్భాలలో మనం సమకాలీన పరిణామాలను గమనించినప్పుడు, తక్షణ స్పందనగా ఉద్రేకపూరిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటాం. ఉదాహరణకు, హేయమైన అత్యాచార సంఘటనలు జరిగినప్పుడు దోషుల్ని ఉరితీయాలని, కాల్చి చంపాలని చాలా మంది అంటూ ఉంటారు. అలాంటివి ఆ క్షణానికి వినడానికి బాగానే ఉంటాయి గానీ, ఆచరణలో సాధ్యం కావు. ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ కూడా అలాంటి ఒక ఆచరణ సాధ్యం కాని మంచి డిమాండ్ తో ముందుకు వచ్చారు. ఈసారి ఆయన ఏకంగా హైకోర్టులో పిల్ వేసి తన వాదను వినిపిస్తున్నారు.
ఒక పార్టీ తరఫున ప్రజాప్రతినిధిగా గెలిచిన తర్వాత.. మరొక పార్టీలోకి మారే నాయకుల సభ్యత్వాలను రద్దుచేసేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీచేయాలని కోరుతూ కెఎ పాల్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేశారు. అలా పార్టీలు మారే వారి మీద వేటు వేస్తే తప్ప ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యం కాదని వ్యాఖ్యానించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినా.. అక్కడ కెఎ పాల్ చాలా హడావుడి చేస్తుంటారు. ఆ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి తానే అని, ప్రజలందరూ తననే కోరుకుంటున్నారని అంటుంటారు. తనను సీఎం చేస్తే లక్ష కోట్లు తీసుకువచ్చి అభివృద్ధిని చిటికెలో చేసి చూపిస్తానని కూడా పాల్ కామెడీ పండిస్తుంటారు. అయితే ఈ నాయకుడు ఈసారి ఒక రీజనబుల్ డిమాండ్ తో హైకోర్టు ఎదుటకు వచ్చారు. అయితే అందులో కూడా కొన్ని లొసుగులు ఉండడం గమనార్హం. ఒక పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి, మరో పార్టీ తరఫున ఎంపీగా పోటీచేసిన వారిపై వేటు వేయాలంటూ.. పాల్ చెబుతున్నారు. నిజానికి ఈ ఆదర్శాలు బాగానే ఉన్నప్పటికీ.. వాటికోసం రాజ్యాంగంలో చాలా మార్పులు అవసరమౌతాయనేది పలువురి మాట.
ఆ సంగతి ఎలా ఉన్నా.. కెఎ పాల్ తొలిసారిగా కామెడీ చేయకుండా.. ఒక సీరియస్ డిమాండ్ తో ప్రజలు ఎన్నదగిన రీతిలో పిల్ వేయడం వరకు అభినందించాలని పలువురు అంటున్నారు.
పాల్ పిల్ : కామెడీ కాదు సీరియస్సే!
Tuesday, December 3, 2024