వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దింపుడు కళ్లెం ఆశలు కూడా ఆవిరైపోయినట్టే! కడపజిల్లాలో జరిగిన రెండు జడ్పీటీసీ ఎన్నికలను పూర్తిగా రద్దు చేయాలని, మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, ఈసారి రాష్ట్ర పోలీసులను పక్కన పెట్టి కేంద్ర భద్రత బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని.. ఇంకా అటువంటి అనేక రకాల గొంతెమ్మ కోరికలతో జగన్ దళాలు హైకోర్టులో వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. కోర్టు ఈ పిటిషన్ ను పరిశీలించే సమయానికే పులివెందుల, ఒంటిమిట్ట రెండు నియోజకవర్గాల్లో కూడా ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. రెండు చోట్ల కూడా వైసీపీ ఓడిపోయింది. అయినప్పటికీ ఈ జోడు ఓటములతో సంబంధం లేకుండా.. హైకోర్టు ఈ పిటిషన్ విషయంలో తమ తీర్పు వెలువరించింది.
రీపోలింగ్ అనే అంశంలో ఈసీ మాత్రమే నిర్ణయం తీసుకోగలదని, ఈసీ నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోజాలం అని హైకోర్టు వ్యాఖ్యానించింది. పోలింగ్ జరిగిన తర్వాత.. వైసీపీ నాయకులే వెళ్లి రీపోలింగ్ కోసం ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదును పరిశీలించి.. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, ఇతర సీసీ టీవీ ఫుటేజీలను కూడా పరిగణనలోకి తీసుకున్న ఈసీ పులివెందుల లో రెండు పోలింగ్ కేంద్రాల పరిధిలో రీపోలింగ్ నిర్వహించింది. కానీ.. వైసీపీ వారికి అది రుచించలేదు. ఆ రీపోలింగ్ ను వారు బహిష్కరించారు. అంతటితో ఊరుకోలేదు. అక్కడికే తమ ఓటమి వారికి ఖరారు కావడంతో.. గురువారం కౌంటింగ్ కు వైసీపీ తమ ఏజంట్లను కూడా పంపలేదు.
పులివెందులలో వైసీపీ ఓటమి పాలైన సంగతి పాఠకులకు తెలిసిందే. మూడు రౌండ్లు కౌంటింగ్ జరిగిన ఒంటిమిట్టలో కూడా వారికి ఓటమి తప్పలేదు. ప్రతి రౌండులోనూ తెలుగుదేశం అభ్యర్థి పైచేయి సాధిస్తూ వచ్చారు. తెలుగుదేశం అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డికి మొత్తం 12,780 ఓట్లు లభించాయి. వైసీపీ అభ్యర్థి ఇరగరంరెడ్డి సుబ్బారెడ్డి 6513 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ముద్దుకృష్ణారెడ్డి 6267 ఓట్లు మెజారిటీతో గెలిచినట్టుగా అధికారులు ప్రకటించారు.
రెండు నియోజకవర్గాల్లో ఓటమి సంగతి ఖరారు అయిన తర్వాత.. వైసీపీ చాలా డ్రామాలు నడిపించింది. దొంగ ఓట్లు వేశారని, ఇతర ప్రాంతాల నుంచి వేలాదిమంది తెలుగుదేశం కార్యకర్తలు తరలివచ్చి ఓట్లు వేశారని.. పోలీసులు తమను పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లనివ్వలేదని రకరకాల నిందలు వేశారు. ఎటూ ఓటమి తేలిపోయింది గనుక.. తాము న్యాయపోరాటం కూడా చేసినట్టుగా బిల్డప్పులు ఇవ్వడానికి.. తమ పిటిషన్లో అర్థంపర్థం లేదని తెలిసినప్పటికీ ఈ ఎన్నికలను రద్దుచేసి.. పూర్తిగా మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలనే డిమాండ్ తో హైకోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా భంగపడ్డారు. హైకోర్టు ఎదుట జగన్ దళాల కుయుక్తులు పనిచేయలేదని ప్రజలు అనుకుంటున్నారు.
