ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి.. తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 3648 కిలోమీటర్ల సుదీర్ఘమైన పాదయాత్ర చేశారు.ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వారికి హామీలు ఇచ్చారు. రాష్ట్రంలో అదివరకు జరిగిన రెండు పాదయాత్రలకంటె అది పెద్దది. వైఎస్సార్, చంద్రబాబులు కూడా ముందు వాళ్ల రికార్డులను బద్దలు చేస్తూ యాత్రలు చేశారు. జగన్ దశ వచ్చేసరికి 3648 కిమీ యాత్ర అయింది. అది రికార్డు అని అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించుకుంది. ఆ రికార్డు ఇప్పుడు ముక్కలు ముక్కలుగా బద్దలైపోబోతోంది. ఇలాంటి సమయంలో పాపం జగన్ ఆ రికార్డును గుర్తు చేసుకుంటున్నారు.
తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న జగన్.. తాను 3648 కిమీలు నడిచి ప్రజల సమస్యలు తెలుసుకుని అధికారంలోకి వచ్చానని ప్రత్యేకంగా చెప్పుకోవడం వింతగా ఉంది. ఆయన నాలుగేళ్ల కిందట జనం మధ్య నడిచి ఉండవచ్చు. కానీ.. అధికారంలోకి వచ్చిన నాటినుంచి ప్రజలకు అత్యంత దూరంగా మెలగుతున్న ముఖ్యమంత్రి కూడా ఆయనే. జగన్ ను కలవడానికి ఎవ్వరికీ అనుమతి ఉండదు. వైఎస్సార్ ప్రతి ఉదయం తన ఇంటి వద్ద ప్రజలను కలిసి వినతులు తీసుకునే వారు. జగన్ అలాంటిదేం లేదు. కనీసం ఎంపీలు, మంత్రులు జగన్ ని కలవాలంటే కూడా కష్టమే. ఇక ఆయన సభలకోసం ఊర్లకు వస్తున్నారంటే.. జనజీవితం నరకమే. ఊరు మొత్తం కర్ఫ్యూ వాతావరణం తాండవిస్తుంది. జనాన్ని ఆల్మోస్ట్ నిర్బంధించేస్తారు. మార్కెట్లు మూసేస్తారు. బారికేడ్లు పెడతారు. దుకాణాలు తెరవనివ్వరు.. ఇంతగా జనం అంటే భయపడుతూ.. తాను తోలించుకున్న జనం ఎదుట మాత్రమే సభ నిర్వహించి జగన్ తిరిగెళ్లిపోతారు. ఇప్పుడు ఆయన తాను జనంతో మమేకమైన నాలుగేళ్ల కిందటి యాత్రను గుర్తుచేసుకుంటున్నది బహుశా అందుకే కావొచ్చు. ఈ మూడేళ్లుగా.. జనంతో కలిసిన సందర్భం లేకపోవడం వల్లనే కావొచ్చు.
జగన్ 3648 కిమీల రికార్డు పాదయాత్రను ఇంకా కొన్ని రోజులు మాత్రమే స్మరించుకోగలరు. త్వరలోనే ఆయన రికార్డులు బద్దలుబద్దలు కాబోతున్నాయి. అన్నమీద వైషమ్యంతో తెలంగాణను రాజకీయ కార్యక్షేత్రంగా ఎంచుకున్న షర్మిల.. అక్కడ ఆల్రెడీ 3500 కిమీలు నడిచేసింది. అరెస్టులతో ఆమె యాత్ర ఇంకా వేడెక్కింది. త్వరలోనే ఇంకో రెండొందల కిలోమీటర్లతో అన్న రికార్డును తొలుత ఆమే బద్దలు కొడుతుంది. జనవరిలో పాదయాత్ర ప్రారంభించే… నారా లోకేష్ 4000 కిలోమీటర్ల యాత్రకు స్కెచ్ వేశారు. అది పూర్తయితే ఎవ్వరూ అందుకోలేని రికార్డు అవుతుంది. జగన్ అప్పటిదాకా మాత్రమే తన రికార్డు యాత్ర గురించి చెప్పుకోగలరు. ఆతర్వాత సైలెంట్ అయిపోవాల్సిందే.
బద్దలు కాబోతున్న రికార్డును స్మరించుకుంటున్న జగన్!
Tuesday, November 12, 2024