దేవుడిని దేవుడిలా చూసేవాళ్లు కొందరు ఉంటారు. దేవుడి పాత్రలు పోషించేప్పుడు ఒక పవిత్రతను పాటించేవాళ్లు ఉంటారు. నందమూరి తారక రామారావు రాముడు, కృష్ణుడు పాత్రలు చేసే రోజుల్లో ఆయా సినిమాలు చేస్తున్నన్ని రోజులు మాంసాహారం కూడా ముట్టేవారు కాదని, నేలమీదనే పడుకునే వారని, ఒంటిపూట భోజనం చేసేవారని కథలుకథలుగా చెబుతుంటారు. పౌరాణిక నాటకాలు వేసేవాళ్లు కూడా దేవుడి పాత్ర చేస్తున్నప్పుడు ఒక భయంతో, భక్తితో మెలగడం మనం చూస్తుంటాం. అయితే ఇదంతా కూడా పాతచింతకాయపచ్చడి ఆలోచనలు అని అనుకోవాలేమో. నవతరం మెచ్చే ఫార్మాట్ లో రామాయణాన్ని ‘ఆదిపురుష్’గా అందిస్తున్న ఓం రౌత్ వ్యవహార సరళిని గమనిస్తే, దేవుడు వారికి కేవలం ఒక మార్కెటింగ్ ఎలిమెంట్ అని అనిపిస్తుంది.
ఓం రౌత్ రాముడి కథను సినిమాగా తీశారు. సినిమా టార్గెట్ చేసేది కేవలం హిందూ ప్రేక్షకులనే గనుక.. ప్రపంచంలోనే దివ్యమైన హిందూ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. చినజీయర్ ను కూడా పిలిపించి, ఆయనతో తమ సినిమా బృందాన్ని పొగిడించుకుని కాస్త హడావుడి చేశారు. అంతా బాగానే ఉంది.
గ్రీన్ మ్యాట్ మరియు కంప్యూటర్ గ్రాఫిక్స్ మాత్రమే ను నమ్ముకుని.. ఎవరికీ అర్థంకాని పద్దుల్లో వందల కోట్ల రూపాయల సినిమా బడ్జెట్ అని నమ్మించి.. దేవుడి పేరును మార్కెట్ చేసుకుంటూ ప్రజల సొత్తును దోచుకోవాలని చూసే ఇలాంటి సినిమా మేకర్స్ కు కనీస దైవభక్తి అయినా ఉందా? ఉంటే ఓం రౌత్ తిరుమలలో అంత అనుచితమైన రీతిలో, అసహ్యంగా ప్రవర్తిస్తారా? అనేది ఇప్పుడు వెల్లువెత్తుతున్న ఆరోపణ.
సినిమా సెలబ్రిటీలు అంటే చాలు తిరుమల అధికారులకు కూడా పూనకం వచ్చేస్తుంది. వారి అడుగులకు మడుగులొత్తుతూ ఏర్పాట్లు చేయడానికి ఎగబడతారు. ఓంరౌత్, కృతిసనన్ లు బుధవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ప్రోటోకాల్ మర్యాదలు శేషవస్త్ర సమర్పణలతో టీటీడీ అధికారులు వారి పట్ల తమ భక్తిని చాటుకున్నారు.
బయటకు వచ్చిన తర్వాత కృతిసనన్ కు వీడ్కోలు చెబుతూ.. ఓం రౌత్ ఆమెను వాటేసుకుని ముద్దు పెట్టుకోవడం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. వీడ్కోలు ఇస్తూ ఆలింగనం వరకు కూడా ఆత్మీయ స్పర్శ కింద సహించగలుగుతున్నారు గానీ, ఫ్లయింగ్ కిస్, బుగ్గ మీద ముద్దులను ప్రజలు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఓం రౌత్ లాంటి వాళ్లకు దేవుడు కేవలం ఒక మార్కెటింగ్ ఎలిమెంట్ మాత్రమేనని, వారి దైవత్వం పట్ల భయభక్తులు ఉండవని వ్యాఖ్యానిస్తున్నారు.
ఓంరౌత్ : ‘దేవుడు కేవలం ఒక మార్కెట్ ఎలిమెంట్’!
Saturday, November 16, 2024