మూడు రాజధానులు ఏర్పాటు చేయడానికి మరింత పకడ్బందీ చట్టం తీసుకువస్తాం అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చాలా ఘనంగా ప్రకటించారు. ‘అధికారం రాష్ట్రప్రభుత్వానికి లేదన్న’ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే ఇవ్వకపోయినా.. ఆ తీర్పు మేం ఊహించినదే, స్వాగతిస్తున్నాం అని సెలవిచ్చిన సజ్జల, త్వరలో కొత్త చట్టం వస్తుందంటున్నారు. అయితే విశ్లేషకులు మాత్రం.. ఇప్పుడు జరుగుతున్న న్యాయపరిణామాలు, రాజకీయ వ్యవహారాలు, రాజ్యాంగ నిబంధనల నేపథ్యంలో కొత్త చట్టం తేవడం అంటే.. ఈ ప్రభుత్వం ఇంకో జన్మ ఎత్తాల్సిందే అని అంటున్నారు.
సుప్రీం తీర్పు నేపథ్యంలో నీరుగారిపోతున్న వైసీపీ శ్రేణులను ఉత్సాహపరచడానికి సజ్జల రామకృష్ణారెడ్డి తెరమీదికి వచ్చారు. తీర్పును పొగుడుతూ, మూడు రాజధానులకోసం కొత్త చట్టం తెస్తాం అన్నారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటలు చాలా తమాషాగా ఉన్నాయి.‘ఆయా ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, న్యాయప్రక్రియకు, రాజ్యాంగానికి లోబడి వికేంద్రీకరణ ఎలా చేయాలో అలా చేస్తాం’ అని సెలవిచ్చారు. అంటే ఆయన ఒకసారి చేసిన తప్పును చాలా ఆలస్యంగా అయినా ఒప్పుకుంటున్నారు. ఇదివరలో ఆ చట్టం తెచ్చినప్పుడు న్యాయ, రాజ్యాంగ పరమైన అంశాలను పట్టించుకోలేదనే అంటున్నారు. ప్రస్తుతానికి అమరావతి మాత్రమే రాజధాని అని సజ్జల చెప్పక తప్పలేదు.
కనీసం సజ్జల ప్రకటించిన నేపథ్యంలోనైనా.. త్వరలోనే విశాఖలో రాజధాని, విశాఖనుంచి వచ్చేవారం నుంచే పరిపాలన..లాంటి అబద్ధపు మాటలతో అమాయకులైన ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేయడాన్ని ఆ పార్టీ నాయకులు, మంత్రులు కొన్నాళ్లపాటు అయినా మానుకుంటే బాగుంటుంది. ఎన్నికల్లో వారికి ఆ వాదన అవసరం అనుకుంటే.. కొత్తగా అప్పుడు ఈ బుకాయింపు మాటలు నెత్తికెత్తకున్నా సరిపోతుంది.
సజ్జల చెప్పినట్టుగా.. నిజంగానే కొత్త చట్టం తేవాలని అనుకుంటే గనుక.. అందుకు రాజ్యాంగం అడ్డుపడుతుంది. రాజధానులను మార్చాలనే నిర్ణయం రాష్ట్రప్రభుత్వం పరిధిలోనిది కాదు అని హైకోర్టు చెప్పడం ఆషామాషీగా, రాజ్యాంగ వ్యతిరేకంగా వచ్చిన మాట ఎంతమాత్రమూ కాదు. ఎందుకంటే.. ఆ తీర్పు తర్వాత.. ‘అధికారం రాష్ట్రప్రభుత్వాలకు ఉండేలా రాజ్యాంగాన్ని సవరించాలని’ కోరుతూ వైసీపీ జాతీయ కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ సారథి విజయసాయిరెడ్డి రాజ్యసభలో ఒక ప్రెవేటు బిల్లు పెట్టారు. అంటే ‘రాజధాని మార్పు అధికారం రాష్ట్ర సర్కారు చేతిలో లేదు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటున్నట్టే. కాకపోతే వారు ఉత్తరాంధ్ర ప్రజలను రాజధాని పేరుతో మోసం చేయాలని అనుకుంటున్నారు. రాజ్యాంగ సవరణ జరిగే దాకా మూడు రాజధానుల పేరుతో ఇంకో చట్టం తేవడం జరిగే పని కాదు. రాజ్యాంగ సవరణ అంత సులువుగా జరగదు. మూడు రాజధానుల ఎజెండాతోనే వైసీపీ ఎన్నిలకు వెళ్లకతప్పదు. మూడు రాజధానుల వంచనను ప్రతిపక్షాలు బయటపెట్టక ఆగవు.
ఇంకో చట్టం తేవాలంటే ఇంకో జన్మ ఎత్తాలి!
Friday, December 20, 2024