ఒకచోట ఏమో.. పట్టపగలు భిక్షకోసం అన్నట్లుగా ఒక దుండగుడు ఇంటికి వచ్చి.. కత్తితో తల నరికే ప్రయత్నం చేసి.. ఎంచక్కా టూవీలర్ లో పారిపోతాడు. అలాంటి నరహంతకుడికి సాక్షాత్తూ మంత్రి అండదండలు ఉన్నాయనేది ప్రతిపక్షాల ఆరోపణ.
ఇంకొకచోట ఏమో.. ఇద్దరు పట్టపగలు చేతుల్లో కత్తులు పట్టుకుని ఊరిలో స్వైర విహారం చేస్తున్నందుకు.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు! అరెస్టు కూడా కాదు!! అక్కడ ఎమ్మెల్యే గారేమో.. ఏకంగా ఓ యాభైమందిని వెంబెట్టుకుని.. పోలీసు స్టేషను మీద దండయాత్రకు వెళ్లినట్లుగా వెళ్లి.. నా మనుషులనే అదుపులోకి తీసుకుంటారా..? ఎంత ధైర్యం? అంటూ పోలీసుల మీద నిప్పులు చెరగుతారు!
అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఈ బరితెగింపు రాష్ట్రాన్ని ఏ దరికి తీసుకువెళ్లబోతోంది. అనేభయం ప్రజల్లో ఏర్పడుతోంది.
ఈ రెండు ఘటనలు రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఒకే రోజు చోటు చేసుకున్నవి. తునిలో పట్టపగలే మండల మాజీ అధ్యక్షుడిని హత్యచేయడానికి ఓ దుండగుడు భవానీ మాల వేషంలో భిక్షకు వచ్చినట్టుగా వచ్చాడు. భిక్ష వేయబోతుండగా.. తల నరికే ప్రయత్నం చేశాడు. మంత్రి దాడిశెట్టి రాజా దీని వెనుక ఉన్నారనేది.. తెలుగుదేశం ఆరోపణ. ఆయన ఖండిస్తున్నారు. అయినా సరే.. ఈ హత్యకు యత్నించిన తీరులోనే ఒక విపరీతమైన బరితెగింపు కనిపిస్తోంది. ఇలాంటి సంఘటన/దాడి ఏ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీదనో జరిగిఉంటే.. పోలీసులు సాయంత్రంలోగా దుండగుడిని అరెస్టు చేసి ఉండేవాళ్లు. మొహానికి గుడ్డ చుట్టినంత మాత్రాన సీసీటీవీ ఫుటేజీ ఉంది. నిందితుడు పారిపోతుండగా విజువల ఉంది.. బండి నెంబరుంది… ఇతర సీసీ టీవీ ఫుటేజీలు ఉంటాయి. అయినా సరే.. పోలీసులు ఇంకా తమ పరిశోధన కొనసాగిస్తున్నారు.
అదే సమయంలో కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో మరో ఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తులు రమేష్, సురేష్ చేతుల్లో కత్తులు పెట్టుకుని.. ఎదురూరు గ్రామంలో తిరుగుతున్నట్లుగా ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చాయి. స్పందించిన పోలీసులు.. అవాంఛనీయ సంఘటనలేమీ జరగకముందే.. వివరాలు తెలుసుకోవడానికి ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పాపం అరెస్టు కూడా చేయలేదు. ఈలోగానే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ ఆగ్రహం ముంచుకొచ్చింది.
యాభై మంది అనుచరుల్ని వేసుకుని అర్ధరాత్రి సమయంలో స్టేషన్ మీదకు వెళ్లి పోలీసుల మీద రంకెలు వేశారా? నా అనుచరుల్నే అదుపులోకి తీసుకుంటారా? అని ఆగ్రహించారు. తన అనుచరులు కత్తులు పట్టుకుని ఊరిలో తిరిగితే తన పరువు పోతుందనే భయం ఆ ఎమ్మెల్యేకు ఉన్నట్టు లేదు. వారిని అదుపులోకి తీసుకోవడమే నేరం అయినట్లు పోలీసులమీద జులుం చేశారు.
సాక్షాత్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దన్నుతో నేరజీవితమే ప్రవృత్తిగా గలవారు చెలరేగిపోతున్నారని ప్రజలకు ఒక అభిప్రాయం ఏర్పడితే.. ఇలాంటివాళ్లే అందుకు కారకులు కదా!