సాంకేతిక ఆధారంగా నేరగాళ్లను పట్టుకోవడం ఈ రోజుల్లో చాలా సులభం అయిపోతోంది. చోరీలు, దోపిడీలు, హత్యలు వంటివి జరిగితే.. దాదాపుగా ప్రతిఊరిలోనూ లెక్కకు మిక్కిలిగా ఉండే సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించడం ద్వారా.. చాలా సందర్భాల్లో ఒక రోజులోనే నిందితులను పట్టుకుని మొత్తం సొమ్ము రికవరీ చేస్తున్నారు. అదే సమయంలో.. ఆర్థిక రాజకీయ, వైట్ కాలర్ నేరగాళ్ల విషయంలో ఫోనుల్లోని సాంకేతికత వారిని పట్టి ఇచ్చేస్తోంది. వారి నేరాలు బయటపడిపోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో అత్యంత వివాదాస్పదుడు అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫోను చోరీకి గురైందనే వార్త సంచలనం సృష్టించకుండా ఎలా ఉంటుంది?
పోలీసులు నిజంగానే ఒక కేసును నిగ్గు తేల్చదలచుకుంటే గనుక.. సాంకేతికత వారికి ఎంతో ఉపయోగపడుతోంది. ఇదివరకటిలా ఫోన్లలో ఉండే మెసేజీలు, వాట్సప్ సంభాషణలు మాత్రమే కాదు.. ఆడియో రికార్డులను కూడా వెలికి తీస్తున్నారు. ఇవన్నీ చాలా కాలంగా జరుగుతున్న పద్ధతులే కాగా.. ఆధునిక తరంలో ఐఎంఈఐ నెంబరు ఆధారంగా మరింత గుట్టును బయట పెడుతున్నారు. ఇదివరలో ఫోను నెంబరు సంభాషణల విషయంలో నిందితులు కొంత నాటకాలాడినా.. పోలీసులు సెల్ ఫోన్ కంపెనీల ద్వారా కాల్ రికార్డు వివరాలు స్వీకరించి, మెసేజీలు సేకరించి దర్యాప్తు జరిపేవారు. ఇప్పుడు ఇంకా దర్యాప్తు మెరుగుపడింది. మధ్యలో ఫోన్లను మార్చేసినా, ప్రీపెయిడ్ నెంబరు ద్వారా కాల్ రికార్డులు సమస్తంగా దొరకకపోయినా.. వారికి ఐఎంఈఐ నెంబరు ఉపయోగపడుతోంది. దాని ద్వారా.. అనేకానేక వివరాలు రాబట్టేస్తున్నారు. అందుకే వైట్ కాలర్ నేరాల నిందితులను విచారించేప్పుడు ఫలానా మొబైల్ నెంబరు, ఫలానా ఐఎంఈఐ నెంబరున్న సెల్ ఫోను తీసుకు రావాలని వారు నోటీసులు ఇస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలో విజయసాయిరెడ్డి తన ఐఫోన్ పోయిందని ఫిర్యాదు ఇవ్వడమే తమాషా. సాధారణంగా ఐఫోన్ అంటేచాలా సెక్యూరిటీ ప్రమాణాలు ఉంటాయి. వెతికి పట్టుకోవడం సులువు. చోరీచేసిన వారు వాడుకోవడం కష్టం. ఆయన ఫోను పోయిందని ఫిర్యాదు ఇచ్చినా కేసు రిజిస్టరు కాకుండా, దర్యాప్తు ముందుకు సాగకుండా ఆపించారు.
తన అల్లుడికి అన్న అరబిందో శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టు అయి విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఫోను కనపడకుండా పోవడం వెనుక కారణాలు, దొంగలు ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. విచారణకు పిలిస్తే పోలీసులు ఫలానా ఫోనునే వెంట తీసుకురావాలని స్పష్టంగా పురమాయిస్తారు. అందుకే విజయసాయి ఏకంగా ఫోను పోయిందనే ఫిర్యాదు ఇచ్చేసి చేతులు దులుపుకున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు. ఆల్రెడీ ఢిల్లీ మద్యం కుంభకోణం నిందితులు 170 ఫోన్లు ధ్వంసం చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే వారికి ఇలా ఫోను పోయిందని ముందే ఫిర్యాదు చేయగల తెలివితేటలు ఉన్నట్టులేదు. విచారణను కొంత ఆలస్యం చేయడానికి, కొంత వరకు తమ నేరాలను కప్పెట్టుకోవడానికి ఈ ఫోను పోయిందనే ఫిర్యాదు మార్గం ఉత్తమం అని విజయసాయిరెడ్డి ఒక రాచమార్గం చూపించారని పలువురు అనుకుంటున్నారు.